Site icon HashtagU Telugu

Haryana Election Results 2024: ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం

Haryana Election 2024 Vinesh Phogat(julana)

Haryana Election 2024 Vinesh Phogat(julana)

Haryana Election Results 2024: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా, జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 6,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలిగా వినేశ్ ఫోగట్ ఎమ్మెల్యే అయ్యారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం చూపిన ఫోగట్, ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. అయితే, తరువాతి రౌండ్లలో కొంచెం వెనకబడినట్లు కనిపించారు. మొదటి ఏడూ రౌండ్ల తర్వాత కొంత వెనకపడిన ఫోగట్, 8వ రౌండ్ నుండి ఆధిక్యాన్ని చూపించారు.  15 రౌండ్లు ముగిసే సమయానికి వినేశ్ ఫోగట్ 6,000కు పైగా మెజారిటీ తో గెలుపొందారు.

ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే, హర్యానాలో బీజేపీ మెజార్టీ మార్క్‌కు దగ్గరగా ఉన్నది. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం, బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 35 స్థానాల్లో, ఐఎన్‌ఎల్‌డీ ఒక, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతర పార్టీలకు నాలుగు స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఈ ట్రెండ్ కొనసాగితే, హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటినుంచి బీజేపీపై ప్రజల వ్యతిరేకత పెరుగుతోంది. రైతు ఉద్యమాలు కమలం పార్టీని దెబ్బతీయనున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, అన్ని సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే, హర్యానా ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీ మెజార్టీ మార్క్‌ను సాధించకపోవడానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హర్యానా ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జులానా నుంచి పోటీచేశారు.

పారిస్ ఒలింపిక్స్ అనంతరం వినేశ్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఆమె ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయారు, దీంతో పతకం లేకుండానే ఒలింపిక్స్ నుండి వెనుదిరగాల్సి వచ్చింది. కానీ, ఒలింపిక్స్ తర్వాత ఆమె పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు, రెజ్లర్ల ఉద్యమంలో ఫోగట్ కీలక పాత్ర పోషించారు.

కొన్నేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారు. రైతు చట్టాల విషయంలో మరియు రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఘటనల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె తప్పుపడుతూ మాట్లాడారు. హర్యానా ఎన్నికల సమయంలో, ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెజ్లర్ భజరంగ్ పునియాతో కలిసి ఫోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అప్పటినుంచి, ఆమె బీజేపీ టార్గెట్‌గా మారారు. జులానా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ఫోగట్‌ను ప్రకటించింది. హర్యానాలో కాంగ్రెస్ వేవ్ ఉందని, ఫోగట్ హర్యానా బిడ్డ కావడం వల్ల ఆమెపై ప్రజల సానుభూతి ఉందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కనిపించకపోయినా, జులానాలో ఫోగట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 6,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.