Site icon HashtagU Telugu

Mumbai: ఎంపీ నవనీత్ నివాసం వద్ద టెన్షన్ టెన్షన్

Navaneeth

Navaneeth

ముంబయిలో హైడ్రామా ఓ రేంజ్ లో నడిపించేలా స్కెచ్ వేశారు ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవిరాణా దంపతులు. ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామని వీళ్లు సవాల్ చేశారు. ఇది శివసేన కార్యకర్తలకు నచ్చలేదు. అందుకే పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మాతోశ్రీతో పాటు రాణా దంపతుల ఇంటి దగ్గరికీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. పైగా రాణా దంపతుల ఇంట్లోకి వెళ్లడానికి విఫలయత్నం చేశారు. బారికేడ్లను ధ్వంసం చేసి మరీ ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించడంతో వాళ్లను అడ్డుకోవడానికి పోలీసులకు కష్టాలు తప్పలేదు.

ఇలాంటి ఉద్రిక్త సమయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. బయటివారు ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం.. మాతోశ్రీ దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటే.. శివసైనికులు ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు. అదే రీతిలో తాము కూడా సవాల్ విసురుతామన్నారు. పరిస్థితులను ఇలా మార్చి.. రాష్ట్రపతి పాలన విధిస్తామని తమను బెదిరించొద్దని ఘాటుగానే చెప్పారు.

రెండు వర్గాల మధ్యా మాటల యుద్ధం పెరగడంతో ముంబయి మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. శనివారం ఉదయం 9 గంటలకు వస్తామని రాణా దంపతులు చెప్పడంతో పోలీసు ఉన్నతాధికారులు ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే నవీనీత్ దంపతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేంద్రం కూడా నవనీత్ కు వై కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే.. రాష్ట్రం శాంతియుతంగా ఉండేందుకు.. శాంతిస్థాపనకు హనుమాన్ జయంతి రోజున.. సీఎం ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని కోరారు రాణా దంపతులు. కానీ ఆయన పట్టించుకోకపోవడంతో ఠాక్రే నివాసం దగ్గరకు వెళ్లి అక్కడే హనుమాన్ చాలీసా చదువుతామని చెప్పారు. ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

Exit mobile version