Site icon HashtagU Telugu

5000 Cases : హల్ద్వానీ హింసాకాండ.. 5000 మందిపై కేసులు.. ఐదుగురి అరెస్ట్

5000 Cases

5000 Cases

5000 Cases : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో గురువారం జరిగిన హింసాకాండ వ్యవహారంలో 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  ఘటనకు సంబంధించి నమోదుచేసిన మూడు ఎఫ్ఐఆర్‌లలో 16 మంది పేర్లు ఉండగా, ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకా అరెస్టు(5000 Cases)  చేసినట్లుగా ప్రకటించలేదు. హింసాత్మక సంఘటనలు జరిగిన బంభూల్‌పురా పరిసర ప్రాంతాలలో మినహాయించి ఇతర ఏరియాల్లో కర్ఫ్యూను ఎత్తేశారు. కొన్ని ఏరియాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు.  అల్లర్లపై ఇంకా దర్యాప్తు జరుగుతున్నందున బంభూల్‌పురా ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగతా వారంతా స్వల్ప చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. ఈ హింసాకాండపై ప్రస్తుతం మెజిస్టీరియల్ విచారణ జరుగుతోంది. కూల్చివేసిన మసీదు, మదర్సా కట్టడాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని అధికారులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మదర్సా, మసీదు కూల్చివేతతో..

అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదులను గత గురువారం హల్ద్వానీ పట్టణ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో ఆ రోజు ఓ వర్గానికి వందలాది మంది రోడ్లపైకి వచ్చి  రాళ్లు రువ్వారు. పెట్రోలు బాంబులు విసిరారు. దీంతో దాదాపు 250 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో దాదాపు 150 మంది పోలీసులు ఉండగా, మిగతా వారంతా ప్రభుత్వ అధికారులు,  ప్రభుత్వ సిబ్బంది, జర్నలిస్టులే. సంఘటనా స్థలానికి సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద పార్క్ చేసి ఉంచిన దాదాపు రెండు డజన్ల వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు.

Also Read : CAA 2024 : ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి.. అమిత్ షా ఇంకా ఏమన్నారంటే..

జైల్‌ భరో ఉద్రిక్తం

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం రోజు(ఫిబ్రవరి 9న) ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు దేశంలో ముస్లింలపై అణచివేతకు నిరసనగా బరేలిలో ముస్లిం మతపెద్ద తఖీర్‌ రజా శుక్రవారం జైల్‌ భరో పిలుపునిచ్చారు. తన అభిమానులంతా బరేలీలోని వీధుల్లోకి వచ్చి అరెస్టవ్వాలని కోరారు. దీంతో వేలాది సంఖ్యలో రజా అభిమానులు బరేలీలోని ఇస్లామియా మైదానంలో గుమిగూడారు. శుక్రవారం నమాజ్‌కు కొద్దిసేపటి ముందే రజా జైల్‌ భరో పిలుపునివ్వడంతో ఆయన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో బరేలీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రజా అభిమానులు గుమిగూడిన ఇస్లామియా కాలేజ్ మైదానాన్ని పోలీసులు చుట్టుముట్టారు. బరేలీలోని మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జైల్‌ భరో పిలుపు కారణంగా రజాను పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం బరేలీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బరేలీకి ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసపైనా రజా స్పందించారు. దేశంలో బుల్డోజర్‌ల దాడిని ఇక ఎంత మాత్రం సహించేది లేదన్నారు. సుప్రీం కోర్టే తమను పట్టించుకోకపోతే ఇక తమను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

Exit mobile version