Hajj 2025 : సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర 11 దేశాల పౌరులపై వీసా బ్యాన్ విధించింది. ఈ నిర్ణయం 2025 జూన్ మూడోవారం వరకు అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఇంతకీ.. ఎందుకు ?
Also Read :Waqf UPDATE : ‘వక్ఫ్’ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం
ఈ 14 దేశాల పౌరులకు వీసా బ్యాన్
ఈ ఏడాది ముస్లింల పవిత్ర హజ్ యాత్ర సీజన్ జూన్ 4 నుంచి జూన్ 9 తేదీల మధ్య ఉంటుందని అంచనా. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్దసంఖ్యలో ముస్లింలు ఏటా హజ్ యాత్రకు వెళ్తుంటారు. అయితే హజ్ యాత్రకు ఆతిథ్యమిచ్చే సౌదీ అరేబియా ఈసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్, మొరాకో వంటి 14 దేశాలకు చెందిన పౌరులపై వీసా బ్యాన్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో ఆయా దేశాల వారు సౌదీ అరేబియాలో ఉమ్రా, వ్యాపార లేదా కుటుంబ సందర్శన వీసాలను పొందడానికి తాత్కాలికంగా వీల్లేకుండా పోయింది. 2025 జూన్ మూడోవారం వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
ఎందుకీ బ్యాన్ ?
14 దేశాల పౌరులపై సౌదీ(Hajj 2025) వీసా బ్యాన్‌ను ఎందుకు విధించింది? అంటే.. వీసాల జారీ వ్యవస్థలో పెరిగిన గందరగోళమే దీనికి ప్రధాన కారణం. భారత్, పాక్, బంగ్లాదేశ్‌ల నుంచి చాలామంది అక్రమంగా హజ్ యాత్రకు వస్తున్నట్లు సౌదీ అరేబియా సర్కారు గుర్తించింది. గత ఏడాది హజ్ యాత్రకు ఇలా అక్రమంగా వచ్చిన ఎంతోమంది సరైన సౌకర్యాలకు నోచుకోక, సౌదీ ఎడారుల్లో నడిచినడిచి తీవ్ర ఎండల కారణంగా చనిపోయారు. అప్పట్లో దాదాపు 1300 మందికిపైగా హజ్ యాత్రికులు చనిపోయారు. వాస్తవానికి సరైన వీసాతో వెళితే చాలా సౌకర్యవంతంగా, సకల వసతుల నడమ హజ్ యాత్రను పూర్తి చేసుకోవచ్చు. అక్రమ మార్గాల్లో వెళ్లే వారికి అవన్నీ లభించవు. పాకిస్తాన్ నుంచి హజ్ యాత్ర కోసం వెళ్లే ఎంతోమంది.. సౌదీలో భిక్షాటన చేస్తున్నారని గతంలో సౌదీ సర్కారు గుర్తించింది. భిక్షగాళ్లను తమ దేశానికి పంపొద్దని చాలాసార్లు పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది. భారత్, పాక్, బంగ్లాదేశ్‌లకు చెందిన చాలామంది పౌరులు ఉమ్రా లేదా కుటుంబ వీసాలపై సౌదీ అరేబియాలోకి వెళ్లి, అనుమతి లేకుండా హజ్ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ అంశాన్ని కూడా సౌదీ సర్కారు సీరియస్‌గా పరిగణించింది.