Site icon HashtagU Telugu

Supriya Sule : హ్యాకర్లు 400 డాలర్లు అడుగుతున్నారు.. ఫోన్, వాట్సాప్ హ్యాక్‌పై సుప్రియా సూలే ప్రకటన

Supriya Sule Phones Hacked

Supriya Sule : ఇటీవలే తన ఫోన్, వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యాయని చెప్పిన శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తాజాగా మరిన్ని వివరాలను వెల్లడించారు. హ్యాకర్లు తన టీమ్‌కు ఫోన్ కాల్స్ చేసి  రూ.34వేలు (400 డాలర్లు) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే తన సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్‌లోని సమాచారాన్ని దుర్వినియోగం చేస్తామని హ్యాకర్లు బ్లాక్ బెయిల్ చేస్తున్నారని సుప్రియా సూలే పేర్కొన్నారు.  తమ పార్టీ (శరద్ పవార్ – ఎస్పీ) ప్రధాన కార్యదర్శి అదితి నలవాడే వాట్సాప్ అకౌంటు కూడా హ్యాక్ అయిందని చెప్పారు. హ్యాకర్లు అదితి నుంచి రూ.10వేలు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బులను చెల్లిస్తామని ఆ హ్యాకర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశామని సుప్రియా సూలే (Supriya Sule) వివరించారు. దీంతో డబ్బులను తీసుకునేందుకు ఆ హ్యాకర్లు వారి బ్యాంకు అకౌంట్ల వివరాలను తమకు అందించారని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం తన ఫోన్, వాట్సాప్ ఖాతాలు హ్యాకర్ల చేతిలో ఉన్నందున ఎవరూ మెసేజ్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ చేయకూడదని సుప్రియా సూలే కోరారు. ఈమేరకు తన ఎక్స్ అకౌంటులో ఒక పోస్ట్ చేశారు. ఇప్పటివరకు తన ఫోన్, వాట్సాప్ అకౌంటుకు ఎవరైనా మెసేజ్ పెట్టి ఉంటే.. ప్రస్తుత పరిస్థితి వల్ల సమాధానం ఇవ్వనందుకు ఆమె  క్షమాపణలు కోరారు.  హ్యాకింగ్ అంశంపై తాను ఇప్పటికే మహారాష్ట్రలోని యావత్ ప్రాంత పోలీసులకు కంప్లయింట్ ఇచ్చానని తెలిపారు.  ఈ ఘటనను ఆమె చాలా తీవ్రమైనదిగా అభివర్ణించారు. తన ఫోన్‌లో దాచడానికి ఏమీ లేదన్నారు.  దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, హ్యాకర్లను గుర్తిస్తామని సుప్రియా సూలేకు ఎస్‌పీ పంకజ్ దేశ్‌ముఖ్ హామీ ఇచ్చారు.

బడ్జెట్ సెషన్ తర్వాత తనకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయని సుప్రియా సూలే వెల్లడించారు. “పార్లమెంటులో మాట్లాడిన ప్రతిసారీ .. నాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తుంటాయి.  ప్రతిసారీ ఆ నోటీసులకు నేను బదులిస్తుంటాను. దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించి ప్రజలందరి ముందు పెడతా’’ అని ఆమె తెలిపారు. కాగా, పుణె పోలీసుల సహకారంతో సుప్రియా సూలే ఫోన్ మళ్లీ యాక్టివేట్ అయింది. హ్యాకింగ్ ముప్పు నుంచి బయటపడింది. ఆమెకు చెందిన వాట్సాప్ ఖాతా కూడా యాక్టివేట్ అయింది. ఇందుకుగానూ ఆమె పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు.