Cyber Crime: కిడ్నీకి రూ.3కోట్లు ఇస్తామని.. నిలువునా ముంచేసిన ముఠా

కిడ్నీ ఇస్తే రూ.3కోట్లు ఇస్తామంటే ఓ అమ్మాయిని ముఠా నిలువునా ముంచేసింది

  • Written By:
  • Publish Date - December 12, 2022 / 09:00 PM IST

Cyber Crime: ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆన్లైన్ లో వచ్చే ప్రకటనలు, వేరే వాళ్లు చెప్పే మాటలను నమ్మి గుర్తు తెలియని వెబ్ సైట్లను చూసే వారిని సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి సైబర్ నేరాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కిడ్నీ దానంగా ఇస్తే రూ.3కోట్లు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ అమ్మాయిని నిలువునా ముంచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఓ విద్యార్థిని.. ఆన్లైన్ క్లాసుల కోసం తన తండ్రి వద్ద నుండి మొబైల్ ఫోన్ తీసుకుంది. అయితే తన అవసరం కోసం తన తండ్రి ఫోన్ ద్వారా ఆయన అకౌంట్లోని రూ.2లక్షల రూపాయలను ఆమె వాడుకుంది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే తన మీద కోప్పడతారని, ఆ డబ్బును ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలనే ఆలోచనలో ఉండింది.

అప్పుడు తనకు ఆన్లైన్ లో కిడ్నీ డొనేషన్ కోసం చాలా మంది చూస్తుంటారని, కిడ్నీని దానంగా ఇస్తే భారీగా డబ్బులు ఇస్తారని ఆ అమ్మాయికి ఎవరో చెప్పారు. దాంతో ఆమె ఆన్లైన్ లో గుర్తు తెలియన వెబ్ సైట్ ద్వారా ముందుకు వెళ్లింది. ఈ విషయాన్ని పసిగట్టిన కేటుగాళ్లు ఆమె అవసరాన్ని వాడుకున్నారు.

ఆ అమ్మాయిని నమ్మించడానికి అకౌంట్ తెరిచినట్లు చూపించి, అందులో రూ.3కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినట్లు నమ్మించారు. అయితే ఈ డబ్బు కావాలంటే కొన్ని షరతులు ఉంటాయని.. పోలీస్ క్లియరెన్స్, ట్యాక్స్ లాంటివి ఉంటాయని కేటుగాళ్లు చెప్పారు. దాంతో ఆమె ఏకంగా రూ.16.42లక్షలు కట్టింది. అయినా కూడా మళ్లీ డబ్బులు కట్టాలని ఆమెను కేటుగాళ్లు అడగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఆన్లైన్ లో జరిగే ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు వచ్చే వెరిఫై కాని లింకులను కూడా క్లిక్ చేయవద్దని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నారు. రోజుకో రూపంలో సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయని కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.