2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబంలోని 7గురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పదకొండు మంది నిందితులకు జీవితఖైదు శిక్ష పడింది. అయితే భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆ పదకొండు మంది నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించి…వారిని రిలీజ్ చేశారు. జైలు నుంచి రిలీజ్ అయిన వారిని పూలదండలతో స్వాగతం పలికారు. వారికి స్వీట్లు తినిపించి సంబురాలు చేసుకున్నారు. ఈనేపథ్యంలో రేపిస్టులపై గుజరాత్ లోని గోధ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే రావూజీ సంచలన కామెంట్స్ చేశారు.
వాళ్లు బ్రాహ్మణులు…సంస్కారం ఉన్నవాళ్లని పేర్కొన్నారు. రేపిస్టుల విడుదలపై నిర్ణయం తీసుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ కమిటీలో ఉన్న ఇద్దరు బీజేపీ నేతల్లో సీకే రావుజీ ఒకరు. నేరానికి పాల్పడ్డారో లేదో తనకు తెలియదన్నారు. బ్రాహ్మణలు మంచి సంస్కారవంతులని అందరికీ తెలిసిందేనని…వాళ్లను ఎవరైనా ఈ కేసులో ఇరికించి ఇబ్బంది గురిచేసే ప్రయత్నం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జైళ్లో నుంచి సత్ర్పవర్తనతో ఆకట్టుకున్నారన్నారు.
కాగా ఈ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేపిస్టులను పూలదండలతో సత్కరించాలని యుద్ధ వీరులుగా స్వాతంత్ర్య సమరయోధుల్లా భావిస్తున్నారని విమర్శించారు. నేడు బిల్కిస్ బానోకి జరిగింది రేపు మనలో ఒకరికి జరగొచ్చని…ఇకనైనా భారత్ గొంతు విప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ అభిప్రాయంపై నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సమర్థించారు. దేశ ప్రజలు ఇకనైనా గళం విప్పాళని ఈ తిరోగమన వ్యవస్థకు మౌన వీక్షకులుగా ఉండరాదని వెల్లడించారు.