Site icon HashtagU Telugu

Gujarat: గుజరాత్ లో బీభత్సం సృష్టించిన వరదలు.. పడవులుగా మారిపోయిన కార్లు?

Gujarat

Gujarat

గత కొద్దిరోజులుగా భారతదేశంలోని ఉత్తరాఖండ్ గుజరాత్ ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో నదులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు అన్నీ మునిగిపోవడంతో పాటు ఇండల్లోకి నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెద్దపెద్ద కట్టడాలు సైతం వరదల దాటికి నీట మునుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ వంతు. భారీ వర్షాలు గుజరాత్ ను వనికిస్తున్నాయి.

మరికొన్ని రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో వానల కారణంగా రాజ్‌కోట్‌, సూరత్‌, గిర్‌ సోమనాథ్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. మంగళవారం పలుచోట్ల 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం.. గిర్ సోమనాథ్ జిల్లాలోని సూత్రపాడ తాలూకాలో అత్యధిక వర్షపాతం 345mm నమోదైంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కార్లు, ఇతర వాహనాలు నీటిలో తేలియాడుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వరదల కారణంగా కార్లు , పెద్దపెద్ద వాహనాలు అన్ని పడవల మాదిరిగా నీటిలో తేలి ఆడుతున్నాయి. వరదల కారణంగా దుకాణాలు మూసివేశారు. గిర్‌ సోమనాథ్‌లోని ఓ ప్రాంతంలో మొసలి జనావాసంలోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 43 రిజర్వాయర్లకు హైఅలర్ట్‌ ప్రకటించినట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. మరో 19 రిజర్వాయర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ స్టేట్‌ డిజాస్టర్ రెస్పాన్స్‌ ఫోర్సెస్‌ ను అధికారులు సిద్ధంగా ఉంచారు. గత నెల గుజరాత్‌ ను బిపోర్‌జాయ్ తుపాన వణికించిన సంగతి తెలిసిందే. దాని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భీకర గాలులు, కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆ సమయంలో ఆలయాలు, పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.