Site icon HashtagU Telugu

GST on Cancelled Ticket: రైలు, హోటల్ టిక్కెట్లు రద్దు చేసినా జీఎస్టీ వడ్డన

Irctcrailconnectbooktrainticketatyourfingertips 23 1495530232 Imresizer

Irctcrailconnectbooktrainticketatyourfingertips 23 1495530232 Imresizer

కన్ఫామ్ అయిన రైలు, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఆ టిక్కెట్లను వద్దనుకుంటే రద్దు చార్జీలు చెల్లించాలని తెలుసు. కానీ ఇప్పుడు రద్దు చార్జీలపైనా వస్తు సేవల పన్ను ( జీఎస్టీ) కట్టాల్సి ఉంటుంది. దాంతో, టిక్కెట్లను రద్దు చేయడం కూడా ఖరీదైన వ్యవహారం కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రకం జీఎస్టీ విధింపుపై సర్క్యూలర్ జారీ చేసింది.

ఈ నెల 3వ తేదీనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిశోధన విభాగం జారీ చేసిన ఈ సర్క్యులర్ ప్రకారం టిక్కెట్ల బుకింగ్ అనేది ఒక ‘కాంట్రాక్టు’ అని పేర్కొంది. దీని కింద సర్వీస్ ప్రొవైడర్ (ఐఆర్సీటీసీ /ఇండియన్ రైల్వేస్) వినియోగదారుడికి సేవలను అందిస్తానని హామీ ఇస్తుందని తెలిపింది. కాబట్టి టిక్కెట్లు రద్దు చేసుకున్నా పన్ను చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసేందుకు క్యాన్సెలేషన్ చార్జీపై అదనంగా 5 శాతం జీఎస్టీ విధిస్తారు. విమాన ప్రయాణం, హోటల్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసినా ఐదు శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వర్తించే జీఎస్టీ రేటునే రద్దు చేసుకున్నప్పుడు కూడా వర్తింపచేస్తున్నారు. క్యాన్సెలేషన్ ఫీజు (రద్దు ఛార్జీ) అనేది ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా జరిగే చెల్లింపు కాబట్టి దానిపై జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

‘ప్రయాణికులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు, సర్వీస్ ప్రొవైడర్‌కు చిన్న మొత్తంలో పరిహారం చెల్లించాలి. దీన్ని క్యాన్సెలేషన్ చార్జీగా వసూలు చేస్తారు. క్యాన్సెలేషన్ చార్జీ అనేది ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదు. అది ఒక పేమెంట్ మాత్రమే. కాబట్టి దానికి జీఎస్టీ వర్తిస్తుంది’ అని నోటిఫికేషన్ లో పేర్కొన్నది.

రైల్వే ప్రయాణాల్లో ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ టిక్కెట్ల బుకింక్స్ పైనే ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. సెకండ్ క్లాస్, ఇతర తరగతులకు జీఎస్టీ లేదు. కాబట్టి, ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ ల టిక్కెట్లు రద్దు చేస్తేనే.. క్యాన్సెలేషన్ ఫీజుపై అదనంగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సెకండ్ క్లాస్, ఇతర తరగతుల టిక్కెట్లు రద్దు చేసుకుంటే జీఎస్టీ విధింపు ఉండదు. ప్రస్తుతం రైలు బయలుదేరడానికి 48 గంటలు లేదా అంతకంటే ముందు టికెట్ రద్దు చేసినప్పుడు క్యాన్సెలేషన్ ఫీజుగా రూ. 240 వసూలు చేస్తున్నారు. రైలు బయలుదేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు రద్దు చేసినట్లయితే, టిక్కెట్ మొత్తంలో 25 శాతం రుసుమును క్యాన్సెలేషన్ ఫీజుగా వసూలు చేస్తారు.