PM Modi on GST: న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే జీఎస్టీ ఉత్సవం గురించి ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “జీఎస్టీ తాజా సంస్కరణలు దేశానికి ఒక కొత్త చరిత్రను మొదలుపెడతాయి. పన్నుల భారం తగ్గించి, సాధారణ ప్రజలకు, మధ్య తరగతి కుటుంబాలకు భారీగా లాభం కలిగించబోతున్నాయి” అని చెప్పారు.
తాజా మార్పుల ప్రకారం.. ఇప్పటి వరకు ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబుల స్థానంలో ఇకపై కేవలం రెండు శ్లాబులే ఉండబోతున్నాయి. ఒకటి 5 శాతం, రెండోది 18 శాతం. అంటే 12 శాతం, 28 శాతం శ్లాబులు తొలగించబడ్డాయి. దీని వల్ల నిత్యవసర వస్తువులు, మందులు, సబ్బులు, టూత్‌పేస్టు, ఆరోగ్య బీమా వంటి వాటిపై జీఎస్టీ లేకపోవచ్చు లేదా కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. మునుపు 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువుల్లో 99 శాతం ఇప్పుడు 5 శాతం శ్లాబ్‌లోకి వస్తాయి.
Also Read: SS Thaman: రాబోయే నాలుగు నెలలు కూడా థమన్‌దే హవా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “2017లో దేశంలో వందల కొద్దీ పన్నుల బదులు ఒక్కటే పన్ను విధానం అమలులోకి తీసుకువచ్చాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ లక్ష్యంగా జీఎస్టీని ప్రవేశపెట్టాం. అప్పట్లో నగరం నుంచి నగరానికి వస్తువులు తరలించడంలో పెద్ద రకాలు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్యలు తొలగిపోయాయి. వ్యాపార వాతావరణం మెరుగయ్యింది. పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి” అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. “జీఎస్టీ ఉత్సవం ప్రజల పొదుపుని పెంచుతుంది. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. జీఎస్టీ తగ్గింపు, ఆదాయపు పన్ను మినహాయింపుతో ప్రజలకు మొత్తం రూ.2.5 లక్షల కోట్ల ఆదా లభిస్తుంది. ఇది మధ్యతరగతికి ఒక డబుల్ బొనాంజా,” అని చెప్పారు.
తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) పెద్ద ఊతమిస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాయని మోదీ పేర్కొన్నారు. చివరగా ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిస్తూ “గర్వంగా చెప్పండి… నేను స్వదేశీ కొనుగోలు చేస్తాను” అని అన్నారు.
