Great Nicobar Project : గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌..పర్యావరణాన్ని నాశనం చేసే ప్రణాళిక: సోనియా గాంధీ

ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆమె రాసిన వ్యాసం ప్రస్తుతం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. సోనియా గాంధీ ఈ ప్రాజెక్టును ఒక "పెద్ద పర్యావరణ విపత్తు"గా అభివర్ణించారు.

Published By: HashtagU Telugu Desk
Great Nicobar Project...a plan to destroy the environment: Sonia Gandhi

Great Nicobar Project...a plan to destroy the environment: Sonia Gandhi

Great Nicobar Project : భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్పై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణాన్ని మాత్రమే కాకుండా, స్థానిక ఆదివాసీల హక్కులను కూడా తీవ్రంగా ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆమె హెచ్చరించారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆమె రాసిన వ్యాసం ప్రస్తుతం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. సోనియా గాంధీ ఈ ప్రాజెక్టును ఒక “పెద్ద పర్యావరణ విపత్తు”గా అభివర్ణించారు. రూ. 2.72 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ వల్ల గ్రేట్ నికోబార్ దీవిలో నివసించే షోంపెన్, నికోబారీస్ వంటి ఆదిమ తెగల జీవన శైలి పూర్తిగా నాశనం అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇవే మన దేశ అత్యంత సంక్లిష్టమైన, అరుదైన జీవవైవిధ్యం కలిగిన ప్రాంతాలు. ఇవి కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది అని సోనియా స్పష్టం చేశారు.

ప్రజల మనస్సాక్షి మౌనంగా ఉండకూడదు

ఆదివాసీలను వారి భూముల నుంచి బలవంతంగా వేరు చేయడం, పర్యావరణాన్ని నాశనం చేయడం న్యాయమైనదా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 8.5 లక్షల చెట్లు తొలగించాల్సి వస్తుందని అధికార లెక్కలు చెబుతున్నా, స్వతంత్ర వర్గాల అంచనాల ప్రకారం ఇది 32 లక్షల నుంచి 58 లక్షల చెట్ల వరకు ఉండవచ్చని సోనియా పేర్కొన్నారు. ఈ దెబ్బ తట్టుకోలేనిది. హర్యానాలో మొక్కలు నాటి పరిహారం ఇస్తామనడం హాస్యాస్పదం అని ఆమె విమర్శించారు.

రాజ్యాంగబద్ధమైన ప్రక్రియల్ని పాటించలేదన్న ఆరోపణలు

ప్రాజెక్ట్ అభివృద్ధి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తీసుకోవలసిన అనుమతులు, సంప్రదింపులు పూర్తిగా విస్మరించిందని సోనియా ఆరోపించారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను సంప్రదించకపోవడమే కాక, గ్రేట్ నికోబార్ గిరిజన మండలి అభ్యర్థనలను కూడా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. భూసేకరణ చట్టం-2013 కింద సామాజిక ప్రభావ అంచనాలో స్థానిక తెగలు భాగస్వాములుగా ఉండాల్సి ఉన్నప్పటికీ, షోంపెన్, నికోబారీస్ తెగలను పూర్తిగా పక్కన పెట్టారని ఆమె మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు, సమాజ న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న చర్య అని పేర్కొన్నారు.

భూకంపాల ముప్పు ఉన్న ప్రాంతంలో భారీ నిర్మాణాలు ప్రమాదకరం

ఈ ప్రాజెక్టు భాగంగా నిర్మించబోయే ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం, టౌన్‌షిప్, పవర్ ప్లాంట్ వంటివి తీవ్రంగా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయని, భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న జోన్‌ 5 ప్రాంతంలో ఇవి చాలా ప్రమాదకరమని సోనియా హెచ్చరించారు. తాబేళ్లు గుడ్లు పెట్టే సున్నితమైన తీర ప్రాంతంలో పోర్టు నిర్మించడం ప్రకృతికి నేరంగా భావించాలన్నారు.

భవిష్యత్ తరాల కోసం బాధ్యత తీసుకోవాలి

ఇలాంటి అన్యాయానికి దేశ ప్రజలంతా గళం విప్పాలి. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మన దేశ పర్యావరణ భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అందువల్ల భవిష్యత్ తరాల కోసం ఈ అరుదైన జీవవైవిధ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని ఆమె తన వ్యాసంలో పేర్కొన్నారు.

Read Also: Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం.. రేపు కీలక ఓటింగ్..!

  Last Updated: 08 Sep 2025, 01:18 PM IST