Site icon HashtagU Telugu

Bank Employees Dharna : దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె

బ్యాంకుల‌ ప్రైవేటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యోగులు స‌మ్మెకు దిగారు. ప‌బ్లిక్ రంగ బ్యాంకుల ఉద్యోగులు అంద‌రూ ఈ స‌మ్మెలో పాల్గొన్నారు. ఇవాళ‌, రేపు(16, 17వ తేదీలు) బ్యాంకులను స్వ‌చ్చంధంగా మూసివేశారు. పార్ల‌మెంట్ లో బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తార‌ని భావిస్తూ ఉద్యోగులు ఈ స‌మ్మెకు దిగారు. దేశ వ్యాప్తంగా స‌మ్మె చేస్తామ‌ని ముందుగానే ఉద్యోగ సంఘాలు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియ‌న్ పిలుపు మేర‌కు గ్రామీణ బ్యాంకుల‌తో స‌హా ప‌బ్లిక్ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. తొమ్మిది ప్ర‌ధాన యూనియ‌న్ల‌ను ఈ ఫోరం కింద ఉన్నాయి. అవ‌న్నీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఈస‌మ్మె కొన‌సాగుతోంది. ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీస‌ర్స్ కాన్ఫిడ‌రేష‌న్‌, ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేష‌న్‌, ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ బ్యాంకు వ‌ర్క‌ర్స్ సంయుక్తంగా స‌మ్మెకు పిలుపు నిచ్చాయి.
వ‌చ్చే ఏడాది ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ లో రెండు ప్ర‌ధాన బ్యాంకుల‌ను కేంద్రం ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు అనువైను బిల్లును పెట్ట‌బోతుంది. ఆ మేర‌కు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఆ విష‌యాన్ని తెలుసుకున్న బ్యాంకు ఉద్యోగులు స‌మ్మెకు దిగారు. స్వీప‌ర్ నుంచి ఉన్న‌త స్థాయిలో ఉన్న బ్యాంకు ఉద్యోగి వ‌ర‌కు ఈ స‌మ్మెలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. కేంద్రం ప్రైవేటీక‌ర‌ణ బిల్లును ఉప‌సంహ‌రించుకునేందుకు ఈ స‌మ్మెకు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.