Govt Approves: “మేడ్ ఇన్ ఇండియా”కు జై.. రూ.76,390 కోట్ల రక్షణ కొనుగోళ్లు!

దేశ రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. దేశీయ రక్షణ రంగ పరిశ్రమల నుంచి రూ.76,390 కోట్ల మిలిటరీ ఉత్పత్తులను కొనేందుకు కేంద్ర రక్షణశాఖ ఆమోదముద్ర వేసింది.

  • Written By:
  • Updated On - June 7, 2022 / 01:19 PM IST

దేశ రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. దేశీయ రక్షణ రంగ పరిశ్రమల నుంచి రూ.76,390 కోట్ల మిలిటరీ ఉత్పత్తులను కొనేందుకు కేంద్ర రక్షణశాఖ ఆమోదముద్ర వేసింది. దేశీయ పరిశ్రమల నుంచి మిలటరీ ఉత్పత్తులను కొనేందుకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదించింది. ఈవిషయాన్ని రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది.

నౌకాదళం కోసం రూ.36,000 కోట్లతో.. 

భారత నౌకాదళం కోసం రూ.36,000 కోట్ల అంచనాతో అత్యాధునిక యుద్ధ నౌకలను కొనే ప్రతిపాదనను కూడా డీఏసీ ఆమోదించింది. సర్వైవల్స్‌ మిషన్స్‌, ఎస్కార్ట్‌ ఆపరేషన్స్‌, డిటెర్రెన్స్‌, సర్ఫేజ్‌ యాక్షన్‌ గ్రూపు (సీఏజీ) ఆపరేషన్స్‌, సెర్చ్‌, సముద్ర గస్తీ, శత్రు లక్ష్యాలపై దాడి అవసరాల కోసం ఈ యుద్ధ నౌకలను వినియోగించనున్నారు.

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ ద్వారా..

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ద్వారా డార్నియర్‌ విమానాలు, సుఖోయ్-30 ఎంకెఐ విమానాలను తయారు చేయించాలనే ప్రతిపాదనను సైతం డీఏసీ ఆమోదించింది.

ఆర్మీ అవసరాల కోసం..

ఇండియన్‌ ఆర్మీ కోసం రఫ్‌ టెర్రియన్‌ ఫోర్క్‌ లిఫ్ట్‌ ట్రక్స్‌ (ఆర్‌టీఎఫ్‌ఎల్‌టీఎస్‌), బ్రిడ్జ్‌ లేయింగ్‌ ట్యాంక్స్‌ (బీఎల్‌టీఎస్‌), వీల్డ్‌ ఆర్మౌర్డ్‌ ఫైటింగ్‌ వెహికల్స్‌ (డబ్ల్యుహెచ్‌ ఏఎఫ్‌విఎస్‌), వెపన్‌ లొకేటింగ్‌ రాడార్స్‌ కొనేందుకు డీఏసీ ఆమోదముద్ర వేసింది.

డిజిటల్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రాజెక్టు..

రక్షణ రంగాన్ని డిజిటలైజేషన్‌ చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రాజెక్టును కూడా డీఏసీ ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.