సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు మంజూరులో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రెసిడెన్స్ ప్రూఫ్ అడగకుండానే వారికి ఆధార్ కార్డులు ఇవ్వడానికి ఇబ్బందేమీ లేదని ఈ కార్డులు మంజూరు చేసే uidai సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోలు ఆర్గనైజేషన్‌కు చెందిన గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికెట్‌ను ఆధారం చేసుకొని ఆధార్ కార్డులు ఇస్తామని చెప్పింది. ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అడగబోమని తెలిపింది.
నిజానికయితే ఆధార్ కార్డు కోసం చేసే అప్లికేషన్‌లో ప్రొఫెషన్ ఏమిటన్నది అడగరు. వృత్తి ఏమిటన్నదానితో పనిలేదు. దానితో సంబంధం లేకుండానే కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కార్డు పొందడానికి నివాసం ఉండే ప్రాంతాన్ని రెసిడెన్స్ ఫ్రూప్ గా చూపించాల్సి ఉంటుంది. సోషల్ ప్రాబ్లమ్స్ కారణంగా రెసిడెన్స్ వివరాలు ఇవ్వడానికి వారు ఇష్టపడకపోతుండడంతో కార్డులు మంజూరు కావడం లేదు. కరోనా కారణంగా వారు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఫ్రీ రేషన్ మంజూరు చేసినా, ఆధార్ కార్డులు లేకపోవడంతో తిండి గింజలు అందలేదు. వారు ఆకలితో అలమటిస్తున్న విషయమై సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలయింది. ఐడెంటిటీ ప్రూఫ్ అడగకుండా ఉచిత రేషన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆ కేసుపై విచారణలో భాగంగా తాజాగా uidai కూడా ఇళ్ల వివరాలేవీ అడగకుండా ఆధార్‌లు ఇస్తామని తెలిపింది. అయితే ఈ వివరాలను చాలా రహస్యంగా ఉంచాలని, ఎక్కడా లీక్ కాకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
