Site icon HashtagU Telugu

Govt E Commerce: ప్రభుత్వ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు పోటీ!

Consumer Protection E Commerce Rules Need For More Clarity Blog Imresizer

Consumer Protection E Commerce Rules Need For More Clarity Blog Imresizer

మన దేశంలో రిటైల్ మార్కెట్ విలువ దాదాపు రూ.75 లక్షల కోట్లు. అందుకే దీనిలో లాభాపేక్ష లేకుండా ఓ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ వస్తోంది. దానిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. నందన్ నీలేకనితోపాటు మరికొంతమంది నిపుణులు.. ఓపెన్ టెక్నాలజీ నెట్ వర్క్ ఆధారంగా నడిచే ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ కు రూపకల్పన చేశారు. ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్ సిటీల్లో ఈ నెట్ వర్క్ పైలెట్ ప్రాజెక్టు ఈ రోజు (29-04-2022) ప్రారంభం కానుంది. వాణిజ్య పరిశ్రమల శాఖ దీనిని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది.

ఈ పైలెట్ ప్రాజెక్టు కొద్ది మంది అమ్మకందారులు, వినియోగదారులతో మాత్రమే ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగం కాని సక్సెస్ అయితే తరువాత 100 నగరాలకు విస్తరించడానికి ప్లాన్ చేస్తు్న్నారు. మన దేశంలో ఇ-కామర్స్ మార్కెట్ పై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ దే ఆధిపత్యం. మార్కెట్ లో వీటి వాటా దాదాపు 80 శాతం ఉంటుందని అంచనా. దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవి మార్కెట్ లో క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇప్పుడు వీటికి సవాల్ విసిరి నిలబడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

నిజానికి మొత్తం రిటైల్ మార్కెట్ లో ఆన్ లైన్ అమ్మకాల విలువ ఇప్పటివరకు ఆరు శాతమే ఉంది. ఇంకా 94 శాతం మార్కెట్ ఎక్కడిక్కడ కేంద్రీకృతమై ఉంది. దీనిపై కిరాణా షాపుల వాళ్లు చాలామంది ఆధారపడి ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం చిన్న దుకాణదారులు కూడా అమ్మకాలు జరుపుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా ప్లాట్ ఫామ్ రూపొందించాలని సంకల్పించింది. అందుకే 9 మంది సభ్యుల సలహా సంఘాన్ని
ఏర్పాటుచేసింది.

ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ – ఓఎన్డీసీ పేరుతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇది నడుస్తుంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన యూపీఐ సక్సెస్ అయ్యింది. దానిలాగే ఈ ప్లాట్ ఫామ్ కూడా విజయవంతమవుతుందని ఆశిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థతో చాలా కంపెనీలు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. కిరాణా సరుకులు మొదలు.. ఫ్లైట్ టిక్కెట్ వరకు అన్నింటినీ ఇక్కడ అమ్ముకోవచ్చు..
కొనుక్కోవచ్చు. ఇక దేశంలో 80 కోట్లమంది మొబైల్ వినియోగదారులు ఉండడం వల్ల ఎక్కువమందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.