Google, FB news: డిజిటల్ మీడియాకు గూగుల్​, ఫేస్​బుక్​ నుంచి ఆదాయం ..కొత్త చట్టం యోచనలో కేంద్రం!!

దేశంలో స్మార్ట్ ఫోన్ విప్లవం పుణ్యమా అని డిజిటల్ మీడియా రెక్కలు తొడుగుతోంది. చాలా మంది ఫోన్ లోనే అన్ని న్యూస్ పేపర్లు చదివేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 18, 2022 / 06:45 AM IST

దేశంలో స్మార్ట్ ఫోన్ విప్లవం పుణ్యమా అని డిజిటల్ మీడియా రెక్కలు తొడుగుతోంది. చాలా మంది ఫోన్ లోనే అన్ని న్యూస్ పేపర్లు చదివేస్తున్నారు. వెబ్ సైట్లు ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు న్యూస్ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. ఆయా మీడియా సంస్థలను సోషల్ మీడియాలోనూ ఫాలో అవుతున్నారు.

ఈనేపథ్యంలో డిజిటల్ మీడియాకు మంచి రోజులు తెచ్చే ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోనుందట. గూగుల్​, ఫేస్​బుక్​, యూట్యూబ్​, ఇన్​స్టా ​ వంటి గ్లోబల్​ టెక్​ సంస్థల నుంచి ఆదాయాన్ని షేర్​ చేసుకునే వెసులుబాటు కల్పించేలా చట్టం తేబోతున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదిత చట్టం.. ఒకవేళ అమల్లోకి వస్తే ఆల్ఫా బెట్ (గూగుల్, యూట్యూబ్ యజమాని), మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని), ట్విట్టర్ , అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ సంస్థలు న్యూస్ కంటెంట్ ను వాడుకున్నందుకు..  భారతీయ వార్తాపత్రికలు, డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లకు తమ ఆదాయంలో వాటా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ  టెక్ దిగ్గజాలు మీడియా సంస్థల నుంచి వచ్చే వార్తల కంటెంట్‌ను తమ ప్లాట్​ఫామ్​లలో ఉంచడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ.. మీడియా సంస్థలకు సరైన రీతిలో ఆదాయాన్ని పంచడం లేదనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలోనే కొత్త చట్టం తెచ్చేందుకు భారత ప్రభుత్వం యోచిస్తోందట. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాల్లో ఇప్పటికే ఈ పద్ధతి ఉంది.ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు బిగ్ టెక్‌తో టెక్నో-వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపినప్పుడు తమ దేశీయ వార్తా పబ్లిషర్‌లకు మంచి స్థాయిని అందించడానికి నిర్దిష్ట చట్టాలను ప్రవేశపెట్టాయి. కెనడా కూడా ఈ మధ్యనే ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది Google ఆధిపత్యాన్ని అంతం చేయడంతోపాటు.. న్యాయమైన రాబడిగల ఆదాయాలను నిర్ధారించడానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

3 ముఖ్య ప్రయోజనాలు..

* పాఠకులకి బెటర్​ న్యూస్​, డిఫరెంట్​ కంటెంట్​ డెవలప్​ చేయడంపై దృష్టి పెట్టడానికి చాన్స్​ ఉంటుంది.
* ఇది మెరుగైన, నాణ్యమైన జర్నలిజాన్ని ప్రోత్సహిస్తుంది.
* వార్తలను వ్యాప్తి చేయడానికి వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండే మార్గాలను అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది.