Site icon HashtagU Telugu

PM Modi : 15 టెక్ కంపెనీల సీఈవోలతో మోడీ భేటీ.. ‘మేడ్‌ బై ఇండియా’ గురించి చర్చ

Pm Modi Us Visit Tech Ceos

PM Modi : అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.  మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని ఓ హోటల్‌ వేదికగా నిలిచింది. ఈసందర్భంగా మోడీతో(PM Modi) భేటీ అయిన వారిలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌, ఎన్విడియా సీఈవో జెన్‌సెన్‌ హాంగ్‌ సహా 15 కంపెనీల సీఈవోలు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రధాని మోడీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేశారు. దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోలతో ఫలప్రదంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. ఈసందర్భంగా  టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ తదితర విభాగాల్లో ‘మేడ్‌ బై ఇండియా’ గురించి చర్చించినట్లు తెలిపారు. అంతకుముందు క్వాడ్‌ దేశాధినేతల సదస్సు, ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ పాల్గొని ప్రసంగించారు.

Also Read :Bariatric Surgery: బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏమిటి? కిడ్నీ స‌మ‌స్య‌ల నుండి ఉపశమనం ఇస్తుందా?

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. న్యూయార్క్‌లోని లొటే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో ఈ భేటీ జరిగింది. గాజాలోని దయనీయమైన మానవతా పరిస్థితులపై ఈసందర్భంగా భారత ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలస్తీనాలో శాంతి నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. గాజాలో శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించేందుకు భారత తనవంతుగా తప్పకుండా ప్రయత్నాలు చేస్తుందని మోడీ చెప్పారు.

Also Read :Home Remedies : చుండ్రు నుండి ఉపశమనం పొందడానికి వేప ఆకులను ఈ విధంగా ఉపయోగించండి..!

నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, కువైట్‌ యువరాజు షేక్‌ సబాహ్‌ ఖలేద్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ ముబారక్‌ అల్‌ సబాతోనూ మోడీ న్యూయార్క్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇవాళ న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా నిర్వహించే ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్ ఉంది.

Exit mobile version