Train Accident : గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై పెట్టిన సిమెంటు స్లాబ్‌లను గూడ్స్ రైలు ఢీకొట్టింది. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో(Train Accident) ఉన్న లక్ష్మణ్‌పూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న ఒక పొలం నుంచి సిమెంటు స్లాబ్‌లను తీసుకొచ్చి రైలు పట్టాలపై పెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఉంచాహర్ ఏరియాకు చెందిన రైల్వే పోలీసుల టీమ్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై ఈవిధంగా వస్తువులను ఉంచి కొందరు దారుణాలకు తెగబడ్డారు. ఎంతోమంది రైల్వే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు యత్నించారు. లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమాదాలు తప్పాయి. దీంతో ఆయా ఏరియాల్లోని రైల్వే ట్రాక్‌లపై ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. మొత్తం మీద ఈ ఘటనలతో రైల్వే ప్రయాణికుల్లో భయాందోళనలు పెరిగాయి.
Also Read :MLAs Nomination : బీజేపీ వాళ్లను నామినేట్ చేస్తే ‘సుప్రీం’ను ఆశ్రయిస్తాం.. ఎల్‌జీకి ఒమర్ వార్నింగ్
- ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లను ఉంచిన వ్యక్తిని పోలీసులు గత వారం అరెస్టు చేశారు.
- యూపీలోని కాన్పూర్‌లో గ్యాస్ సిలిండర్‌లను రైల్వే ట్రాక్‌లపై ఉంచడంతో పెద్ద ప్రమాదాలు తప్పాయి.
- మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న రైలును పేల్చివేసేందుకు రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లను దుండగులు అమర్చారు.
- మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో ఉన్న మిస్రోడ్, మండిదీప్ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.
- రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రైలు పట్టాలపై సిమెంట్ దిమ్మెలు పెట్టారు.
- గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్లు ఉంచినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.