Site icon HashtagU Telugu

Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మై భాయ్ మన్మోహన్ – మలేషియా ప్రధాని ట్వీట్

Anwaribrahim Modi

Anwaribrahim Modi

భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మై భాయ్ మన్మోహన్ అంటూ మలేషియా ప్రధాని ట్వీట్ చేసి మన్మోహన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh Death) ఇక లేరు అనే వార్త యావత్ ప్రజానీకం తట్టుకోలేకపోతున్నారు. 92 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూయడం తో ప్రతి ఒక్కరు సంతాపం తెలుపుతూ వస్తున్నారు. కేవలం మన దేశం వారే కాదు ప్రపంచ దేశాల వారు సైతం మన్మోహన్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారు.

ఈ క్రమంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను జైల్లో ఉన్న చీకటి రోజులలో మన్మోహన్ సింగ్ చూపించిన దయ, మానవీయతను ఆయన స్మరించుకున్నారు. తాను జైలులో ఉన్నప్పుడు తన కొడుక్కు స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేయడమే కాకుండా, ఆ సమయంలో నిజమైన స్నేహితుడిగా అండగా నిలిచారని అన్వర్ తెలిపారు. అయితే ఆ స్కాలర్‌షిప్‌ను తిరస్కరించినప్పటికీ, మన్మోహన్ చూపించిన మంచితనం తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. ‘గుడ్ బై ఫ్రెండ్.. మై భాయ్ మన్మోహన్’ అంటూ ఆయన మన్మోహన్‌కు తుది వీడ్కోలు పలికారు.

ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ చేసిన కృషిని అన్వర్ ఇబ్రహీం కొనియాడారు. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయన చరిత్రలో నిలిచారని, ప్రపంచ ఆర్థిక దిగ్గజాల మధ్య భారత్‌ను నిలిపిన నేతగా ఆయన పాత్ర అమోఘమని అన్నారు. 1990వ దశకంలో తాను మన్మోహన్ ఆర్థికమంత్రులుగా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆర్ధిక రంగంలో సంస్కరణలను ప్రత్యక్షంగా చూసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు.
అవినీతి వ్యతిరేక పోరాటంలో తమ ఇద్దరి మధ్య ఉన్న మైత్రిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కొన్ని ముఖ్యమైన కేసులపై కలిసి పనిచేసిన సందర్భాలను ఆయన పంచుకున్నారు. రాజకీయ నేతగా మన్మోహన్ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఆయనలో ఉన్న దృఢసంకల్పం రాజకీయాన్ని ఆత్మీయతతో మేళవించిందని కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా తీరని లోటుగా పేర్కొన్నారు. భావితరాలకు ఆయన గొప్ప స్ఫూర్తినిచ్చే నేతగా నిలుస్తారని, ఆయన వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని అన్వర్ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు.

Read Also : New Year Gift : ఏపీలో పెన్షన్ దారులకు న్యూ ఇయర్ గిఫ్ట్