Retail Inflation : దేశ ఆర్థిక రంగానికి, ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఇది ఒక మంచి పరిణామం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం (చిల్లర ద్రవ్యోల్బణం) గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 జులై నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైంది. ఇది 2017 జులై తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. గత జూన్‌లో ఈ రేటు 2.10 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే 55 బేసిస్ పాయింట్ల తగ్గుదల నమోదవడం విశేషం. ఇది వరుసగా తొమ్మిదోసారి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.
ఆహార ధరల పతనం ప్రధాన కారణం
ఈ భారీ తగ్గుదలకు ప్రధానంగా కారణం ఆహార పదార్థాల ధరల భారీ పతనమే. నిపుణుల విశ్లేషణ ప్రకారం, జులైలో ఆహార ద్రవ్యోల్బణం -1.76 శాతంగా నమోదైంది. అంటే గతంలో కంటే ధరలు తగ్గినట్లు సూచిస్తోంది. ఇది 2019 జనవరి తర్వాత తొలిసారిగా నమోదైన అతి తక్కువ స్థాయి. ప్రత్యేకించి పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, చక్కెర వంటి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గడం సామాన్యుల బడ్జెట్‌కు ఉపశమనం కలిగిస్తోంది. దీంతో పాటు రవాణా, కమ్యూనికేషన్, విద్యా రంగాల్లోనూ ఖర్చులు కొంత తగ్గుముఖం పట్టాయి.
గ్రామీణ-పట్టణాల్లో రెండింటిలోనూ శాంతి
ఈ ద్రవ్యోల్బణ తగ్గుదల ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జూన్‌లో 1.72 శాతంగా ఉన్న రేటు, జులైలో 1.18 శాతంకు పడిపోయింది. అదే విధంగా, పట్టణ ప్రాంతాల్లో 2.56 శాతం నుంచి 2.05 శాతంకు తగ్గింది. రెండు చోట్లా ఆహార ధరలు రుణాత్మకంగా నమోదవడం విశేషం.
కొన్ని రంగాల్లో మాత్రం వృద్ధి
అయితే అన్ని రంగాల్లో ధరలు తగ్గలేదన్నది మరో వాస్తవం. గృహనిర్మాణ రంగంలో ద్రవ్యోల్బణం 3.17 శాతం వద్ద స్థిరంగా ఉండగా, ఆరోగ్య రంగంలో మాత్రం స్వల్పంగా 4.57 శాతంకు పెరిగింది. ఇంధనం, విద్యుత్ రంగాల్లోనూ స్వల్ప వృద్ధి నమోదైంది.
నిపుణుల అభిప్రాయాలు
ఈ పరిస్థితులపై ఎల్ అండ్ టీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ సచ్చిదానంద్ శుక్లా మాట్లాడుతూ..ఇది వరుసగా తొమ్మిదోసారి ద్రవ్యోల్బణం తగ్గింది. ఇది తాత్కాలిక కనిష్ఠ స్థాయి కావొచ్చు. అయితే, 2026 మార్చికి ఇది ఇప్పటి రేటుతో పోల్చితే మూడు రెట్లు పెరిగే అవకాశముంది అని సూచించారు. మరోవైపు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సాక్షి గుప్తా మాట్లాడుతూ..ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రధాన కారణం ఆహార ధరల తగ్గుదలే. ఇది తక్షణమే ఆర్‌బీఐ ద్రవ్య విధానంపై ప్రభావం చూపకపోవచ్చు. కానీ, పరిస్థితులు ఇలా కొనసాగితే, అక్టోబర్‌లో వడ్డీ రేట్ల కోతపై ఆశలు పెట్టుకోవచ్చు అన్నారు.