Railway employees : రైల్వే ఉద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే శాఖ, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తును భరోసా ఇవ్వేలా భారీ బీమా రక్షణ కల్పించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) రైల్వే మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద, ఎస్‌బీఐలో శాలరీ ఖాతా కలిగిన రైల్వే ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మృతి చెందితే, వారికి రూ. కోటి వరకు ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇదే కాదు, సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల బీమా రక్షణ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ బీమా కవరేజీ కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే, ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే ఈ పథకం వర్తిస్తుంది.
Read Also: YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!
ఈ అవగాహన ఒప్పందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో అధికారికంగా కుదిరింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా రైల్వే శాఖ మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని, వారి కుటుంబాల భద్రతను పెంపొందించడమే ఈ నిర్ణయానికి గల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతీయ రైల్వేల్లో సుమారు 7 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఎస్‌బీఐ ద్వారా చెల్లింపవుతున్నాయి. వీరందరికీ ఈ బీమా కవరేజీ వర్తించనుంది. అంటే, ఇది దేశవ్యాప్తంగా ఉన్న వేలాది కుటుంబాలకు నైతిక, ఆర్థిక భరోసాగా నిలవనుంది. ఈ బీమా కవరేజీ కేవలం సాధారణ ప్రమాదాలకే పరిమితం కాదు. ఇందులో విమాన ప్రమాదాల ద్వారా జరిగే మరణాలకు కూడా రూ. 1.60 కోట్ల వరకు కవరేజీ పొందవచ్చు. అలాగే, ఇతర విభిన్న రకాల ప్రయాణ ప్రమాద బీమా, పర్మనెంట్ డిసేబిలిటీ కవరేజీలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. రైల్వే శాఖ ఈ అవకాశాన్ని “శ్రామిక శక్తికి మద్దతుగా” తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొంది. భారతీయ రైల్వే వ్యవస్థను నడిపిస్తున్న ఉద్యోగుల సంక్షేమమే రైల్వే అభివృద్ధికి అసలు పునాది అని అభిప్రాయపడింది. కేవలం జీతాలు ఇవ్వడం కాదని, ఉద్యోగుల భద్రత, కుటుంబాల బాగోగులు కూడా ప్రభుత్వ బాధ్యత అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొనడం గమనార్హం.
ఈ బీమా పథకానికి ముఖ్యాంశాలు:
. రూ. కోటి ప్రమాద బీమా కవరేజీ
. రూ. 10 లక్షల సహజ మరణ బీమా
. రూ. 1.60 కోట్ల విమాన ప్రమాద మరణ కవరేజీ
. ఎలాంటి ప్రీమియం లేకుండా – ఉచితంగా
. వైద్య పరీక్షలు అవసరం లేదు
. ఎస్‌బీఐ శాలరీ ఖాతా కలిగిన రైల్వే ఉద్యోగులకు వర్తింపు
ఈ బీమా కవరేజీతో రైల్వే ఉద్యోగులు ఇప్పుడు మరింత భద్రతతో ముందుకు సాగొచ్చు. ప్రభుత్వ వైఖరిని చూస్తే, ఉద్యోగుల సంక్షేమంపై విశేష శ్రద్ధ కనబరుస్తున్నట్టు స్పష్టమవుతోంది.
Read Also: Landslide : సూడాన్‌లో తీవ్ర విషాదం..కొండ చరియలు విరిగి 1000 మందికి పైగా మృతి