H1B Visa : హెచ్-1బీ వీసా రెన్యూవల్ ప్రక్రియను అమెరికా మరింత ఈజీగా మార్చింది. కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యూవల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను డిసెంబరులో ప్రారంభించనుంది. ఈ ప్రోగ్రామ్ 3 నెలలు అందుబాటులో ఉంటుంది. దీని కింద తొలుత 20వేల మందికి వీసాలను రెన్యూవల్ చేయనున్నారు. ఈ సంస్కరణతో ఎక్కువగా లబ్ధిపొందే వారిలో భారతీయులే ఉంటారని అంటున్నారు. ఈమేరకు అమెరికా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలను వెల్లడిస్తామని జూలీ స్టఫ్ తెలిపారు. ఇప్పటివరకు హెచ్-1బీ వీసా కలిగిన వారు రెన్యువల్ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి వచ్చేది. తమ స్వదేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో స్టాంపింగ్ కోసం వీసా అపాయింట్‌మెంట్‌కు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఇకపై ఈ వ్యయప్రయాసలన్నీ తొలగిపోతాయి. ఇకపై హెచ్-1బీ వీసా కలిగిన వారు తమ వీసాల రెన్యువల్‌తో పాటు స్టాంపింగ్‌ను అమెరికాలోనూ(H1B Visa) చేసుకోవచ్చు.