12వ విడత పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి 10కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు 20వేల కోట్ల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. దీపావళికి ముందే రైతులకు 12 విడత పీఎం కిసాన్ నిధులు వారి అకౌంట్లో జమా అయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 17న భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పూసాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ..ఈ విడత నిధులను విడుదల చేయనున్నారు. రెండు రోజుల నేషనల్ అగ్రి స్టార్టప్ కాన్క్లేవ్, కిసాన్ సమ్మేళన్‌లను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ దేశంలోని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా 25 వేల మందికి పైగా అడ్వాన్స్‌డ్ రైతాంగాన్ని ఈ సదస్సుకు ఆహ్వానించారు.
దీపావళికి ముందు రైతులకు కానుక:
దీపావళికి ముందు, 12వ విడత పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి 10కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు 20వేల కోట్ల రూపాయలు జమకావచ్చని అంచనా. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి దేశంలోని 11.30 కోట్ల మంది రైతులకు 11 విడతల్లో మొత్తం రూ.2.10 లక్షల కోట్లు అందించారు. ఈసారి వాయిదాను విడుదల చేయడానికి ముందు, రైతుల అర్హతలను తనిఖీ చేయాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్, భూమికి సంబంధించిన డిజిటల్ వివరాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేని వారి వాయిదా ఈసారి నిలిపివేసే అవకాశం ఉంది. అర్హుల జాబితాను అప్‌డేట్ చేయడం ద్వారా ప్రమాణాలు ఉన్న రైతులకు మాత్రమే ఈ విడత అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది.
ప్రగతిశీల రైతులకు ఆహ్వానం:
అక్టోబరు 17, 18 తేదీల్లో పూసా మేళా మైదానంలో జరగనున్న నేషనల్ స్టార్టప్ కాన్క్లేవ్, కిసాన్ సమ్మేళన్‌లో, గత కొన్నేళ్లుగా తమ మెరుగైన వ్యవసాయం వల్ల రెట్టింపు ఆదాయాన్ని పెంచుకున్న రైతుల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 300కు పైగా స్టార్టప్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రాఫ్తార్ ప్రాజెక్ట్ కింద మొత్తం 3000 మందికి పైగా స్టార్టప్ వ్యవస్థాపకులు వ్యవసాయ రంగంలో శిక్షణ పొందారు. వచ్చే మూడేళ్లలో మొత్తం 5000 మంది స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్‌లకు శిక్షణ ఇవ్వడమే దీని లక్ష్యం. వ్యవసాయ రంగంలో మంచి పనితీరు కనబరిచిన స్టార్టప్‌ల విజయాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దేశంలో స్టార్టప్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల సీడ్ ఫండ్‌ను కేటాయించిన సంగతి తెలిసిందే.