Golden Doors : అయోధ్య రామమందిరం జనవరి 22న జరగనున్న ప్రారంభోత్సవం కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయంలో బాలరాముడు కొలువు తీరనున్న గర్భగుడికి బంగారు తాపడం చేసిన తలుపులను అమర్చారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ తలుపులకు బంగారు తాపడం చేసింది. మిగిలిన 14 తలుపులకు స్వర్ణ తాపడం చేయిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయం మొదటి అంతస్తులో 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇక మకర సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 14న చిత్రకూట్ నుంచి అయోధ్య వరకు చరణ్ పాదుక యాత్ర ప్రారంభమవుతుంది. ఇది మంఝాపుర్, కౌశాంబి, ప్రతాప్‌గఢ్, సుల్తాన్‌పుర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా జనవరి 19న అయోధ్యలోని నందిగ్రామ్‌కు చేరుకుంటుంది. జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మార్చి 24 వరకు అయోధ్యలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతారు. దీనికోసం 35వేల మంది కళాకారులను ఎంపిక చేశారు. ప్రతి రోజు 500 మంది కళాకారులు ప్రదర్శన ఇస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
రామ్ హల్వా
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు 7 వేల కిలోల రామ్ హల్వాని తయారు చేయించబోతున్నారు. రామ మందిర ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమం కోసం 12 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ప్రత్యేక కడాయిని వాడుతారు. దీన్ని ఎత్తాలంటే క్రేన్ అవసరం. దీని బరువు సుమారు 1300-1400 కిలోల బరువు ఉంటుంది. ఈ కడాయిలో 7 వేల కిలోల రామ్ హల్వాని తయారు చేయబోతున్నారు. 10 నుంచి 12 కిలోల బరువు ఉన్న గరిటెలు దీనికి ఉపయోగిస్తారు. 900 కిలోల రవ్వ, వెయ్యి కిలోల నెయ్యి, వెయ్యి కిలోల పంచదార, 2000 లీటర్ల పాలు, 2500 లీటర్ల నీళ్ళు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 75 కిలోల యాలకుల పొడితో హల్వా తయారు చేయనున్నట్లు చెఫ్ చెప్పారు.
Also Read: Ganja – Donkey : గాడిదల పెంపకం ముసుగులో గంజాయి దందా.. ఇలా దొరికారు
తొమ్మిది దేశాల టైం..
ఒకేసారి 9 దేశాల టైంను తెలిపే గడియారాన్ని అనిల్ సాహు అనే రామ భక్తుడు రూపొందించాడు. ఇందులో ఒకే ఒక ముల్లు ఉంటుంది. రామలయంలో ఉంచేందుకు ఈ గడియారం బహుమతిగా ఇవ్వనున్నాడు. ప్రపంచంలోనే పెద్ద దీపం అయోధ్యలో వెలిగించనున్నారు. 28 మీటర్ల పొడవు ఉండే ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె అవసరం. దీపంలో పెట్టె వత్తి కోసం 1.25 క్వింటాళ్ల పత్తిని వాడారు. ఈవిధంగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.