Gold Saving Schemes : డబ్బులు ఊరికేరావు అంటూ ఊదరగొట్టే…మంత్లీ గోల్డ్ స్కీం లాభమా నష్టమా..? పూర్తి వివరాలు మీకోసం…?

బంగారంతో భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. ప్రపంచంలోనే ఈ విలువైన లోహాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 08:33 PM IST

బంగారంతో భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. ప్రపంచంలోనే ఈ విలువైన లోహాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్‌పై నగల వ్యాపారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడ్డ ప్రజలు, ఈ సంవత్సరం నెమ్మదిగా బంగారం కొనుగోలు వైపు అడుగులు వేస్తున్నారు.

అయితే బంగారం ధరలు ఏకంగా రూ.50 వేలు దాటిపోయాయి. దీంతో అధిక ధర కారణంగా, ఆభరణాలు కొనడం చిన్న కుటుంబాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే చిన్న కుటుంబాలకు బంగారం పొదుపు పథకాలు ఉపయోగపడతాయి. సాధారణంగా నగల షోరూంలు అందించే ఇటువంటి పథకాల ద్వారా, మీరు ముందుగానే నెల నెలా కొద్ది మొత్తం పొదుపు చేసి ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ పద్ధతిలో కొనడం లాభమా, లేక నష్టమా అనేది తెలుసుకుందాం.

బంగారం లేదా ఆభరణాల పొదుపు పథకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఎంచుకున్న కాలం కోసం ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసి, గడువు ముగిసినప్పుడు, మీరు డిపాజిట్ చేసిన మొత్తం డబ్బుకు సమానమైన విలువతో బంగారాన్ని (అదే షాపు నుండి) కొనుగోలు చేయవచ్చు. అయితే బంగారం ఆభరణం కొనే సమయానికి ఉన్న ధర వద్ద మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో, స్వర్ణకారుడు మీ నెలవాయిదా ముగిసే సమయానికి ఒక నెల వాయిదాను నగదు ప్రోత్సాహకంగా జతచేస్తాడు లేదా వేస్టేజీ, మజూరీ చార్జీలను మినహాయిస్తాడు.

భారతీయులకు ఉన్న ఈ బంగారంపై ఉన్న మోజును తమ లాభంగా మార్చుకోవడానికి, నగల షాపుల వాళ్లు ఈ నెలవారీ పొదుపు స్కీంను ప్రవేశ పెట్టారు. బంగారం పెట్టుబడికి ఇది ఒక విలక్షణమైన, అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. సాధారణంగా ఈ పథకాలు మిడిల్ క్లాస్ వారి కోసం ఉద్దేశించబడ్డాయి. కాబట్టి ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం కనీసం రూ.500తో ప్రారంభమవుతుంది. ఈ పథకాల వ్యవధి గరిష్టంగా 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు నిర్ణీత తేదీన నెలవారీ వాయిదా చెల్లించాలి. దీనివల్ల ప్రయోజనాలు రెండు రకాలుగా ఉంటాయి

a) కొద్ది మొత్తంలో బంగారం కోసం డబ్బు పొదుపు చేసి కొనుగోలు చేయవచ్చు. మీ డబ్బును బంగారు ఆభరణాల యాజమాన్యం వద్దే ఉంటుంది కాబట్టి కచ్చితంగా బంగారం కొనాల్సి ఉంటుంది.
b) మీరు 11 నెలలు చెల్లిస్తే 12వ నెల చెల్లింపును నగల షాపు యాజమాన్యమే చెల్లిస్తుంది.

మంత్లీ గోల్డ్ స్కీంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.
>> ఈ స్కీమ్‌లలో మీకు ప్రతిఫలంగా ఎలాంటి వడ్డీ లభించదు. మీ వ్యవధి పూర్తి అయిన తర్వాత ఆ రోజు బంగారం రేటును బట్టి మీరు నగలను ఎంపిక చేసుకోవాలి.
>> ఏదైనా ఆర్థిక సమస్యల కారణంగా మీరు భవిష్యత్తులో చెల్లింపును మధ్యలో నిలిపివేస్తే, అప్పటి వరకూ చెల్లించిన మొత్తాన్ని మీకు తిరిగి ఇవ్వరు.
>> కొన్ని బంగారు దుకాణాలు ఈ గోల్డ్ స్కీమ్‌లలో సభ్యులుగా ఉన్నవారికి మేకింగ్ ఛార్జీలు, వేస్టేజీలో కొంత తగ్గింపును అందిస్తాయి (కానీ ఇలాంటి ఆఫర్ కొన్ని డిజైన్‌లకు మాత్రమే అని గుర్తుంచుకోండి).

ఒక నెల వాయిదా యాజమాన్యమే కడుతుంది వెనుక ఉన్న మతలబు ఇదే…
>> అయితే వృధా లేదా మేకింగ్ ఛార్జీలను ఎవరు నిర్ణయిస్తారో ఆ దేవుడికే తెలుసు. అంటే 12వ నెల వాయిదాను ఈ రూపంలో తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది.
>> మరో ముఖ్యమైన విషయం, ఈ స్కీంలు పూర్తిగా రిస్కుతో కూడినవి. ఎలాంటి హామీ ఉండదు.

మంత్లీ గోల్డ్ స్కీం యజమానికే ఎక్కువ లాభం ఎలాగంటే…
బంగారం స్కీంలలో చేరడానికి ప్రధాన కారణం ఎప్పటికీ ధర పెరగడమే కానీ, తగ్గకపోవడం కూడా ఒక కారణం అనే చెప్పవచ్చు. ఈ స్కీం ద్వారా సేకరించిన సొమ్ము యాజమాన్యానికి ఎంతో లాభం, ఎందుకంటే వారు ఎలాగో ఆ రోజు ధరకే బంగారం ఆభరణం అందిస్తారు. అంతేకాదు వారికి ప్రతి నెల క్యాష్ ఫ్లో వస్తుంది. వడ్డీ కూడా చెల్లించాల్సిన పనిలేదు.

రిస్కు ఇలా…
రెగ్యులేటర్ల ఆమోదం పొందకుండానే ఈ పథకాలను నడుపుతున్నట్లు అటువంటి పథకాలను నిర్వహిస్తున్న దుకాణాలకు కూడా తెలియదు. అలాంటి పథకాలకు ఆమోదం అవసరమని వారికి నిజంగానే తెలియదు. చిన్న చిన్న నగల షాపులే కాదు. మహానగరాల్లో నంబర్ వన్ లేదా టూ అని చెప్పుకునే పెద్ద దుకాణాలు కూడా ఇలాగే ఉన్నాయి. పైన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, ఇటువంటి స్కీమ్‌లు ఎలా తేలుతున్నాయో. కస్టమర్లు ఎలా మోసపోతున్నారో మీరు గమనించవచ్చు.