Gold Price Hiked: పసిడి ధరలు ఎప్పుడూ జోరు మీద ఉంటాయి. బంగారం, వెండి ధరలు ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి భారం అవుతున్నాయి. అయితే కొత్త సంవత్సరంలో ఈ ధరలు ఎలా ఉండబోతున్నాయోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా బంగారం కొనాలనుకునేవారికి ఒక చేదు వార్త చెప్పాలి. 2023లో బంగారం ధర 60 వేల మార్కును అందుకునే అవకాశం ఉంది.
బంగారం అతి త్వరలోనే 60 వేల మార్కును, వెండి 80 వేల మార్కును చేరుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్ టైంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోగా తాజాగా అవి పుంజుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.270లు పెరిగింది. దీంతో రూ. 50,080లు ఉన్న ధర రూ.50,350కు చేరింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ.300లు పెరిగింది. దీంతో రూ.54,630లు ఉన్న ధర రూ.54,930కి చేరిందని చెప్పాలి.
మరోవైపు వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. కేజీకి ఏకంగా వెండి రూ.500 పెరిగింది. దీంతో రూ. 74,500కు వెండి ధర చేరింది. గత కొన్ని నెలలకు ముందు 60 వేలలోపే ఉన్న వెండి ధర గత కొన్ని రోజులుగా పెరుగుతూనే వస్తోంది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గగా ఆ తర్వాత మాత్రం ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకల సందర్భంగా మళ్లీ పెరిగింది. దీంతో బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్ తగిలినట్లైయ్యింది. త్వరలోనే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు.