Fire Accident : గోవాలో భారీ అగ్ని ప్రమాదం.. 25మంది మృతి

Fire Accident : గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న 'బర్చ్‌ బై రోమియో లేన్‌' నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది

Published By: HashtagU Telugu Desk
Fire Accident Goa

Fire Accident Goa

గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. నైట్ క్లబ్‌లో సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. క్లబ్‌ను చెక్కతో నిర్మించడం వల్ల మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 25 మందిలో ముగ్గురు సజీవదహనమవ్వగా, వీరిలో 20 మంది ఊపిరాడక (Asphyxiation) మృతి చెందారని పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్లబ్‌ గతేడాది మాత్రమే ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

‎Morning Drink: గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఈ దుర్ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రమాదానికి గురైన నైట్‌ క్లబ్‌ను స్వయంగా పరిశీలించి, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సావంత్ మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రాథమిక విచారణలో నైట్‌ క్లబ్‌ నిర్వాహకులు నిబంధనలు పాటించలేదని తేలిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ క్లబ్ నడిచేందుకు అనుమతి ఇచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రమాదం భద్రతా నిబంధనల అమలులో ఉన్న లోపాలను మరోసారి వేలెత్తి చూపింది.

ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఈ ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు మరియు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడినట్లు తెలిపారు. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందని వివరించారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ (PMNRF) నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారాన్ని అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. జాతీయ స్థాయిలో అగ్ర నాయకుల సానుభూతి ప్రకటనలు ఈ విపత్తు యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాయి.

  Last Updated: 07 Dec 2025, 09:48 AM IST