Site icon HashtagU Telugu

G20 Tourism Meet : జీ-20 టూరిజం స‌మావేశాల‌కు సిద్ధ‌మైన గోవా.. ప్ర‌ధాన చ‌ర్చ ఆ స‌మ‌స్య‌ల‌పైనే ..

G20

G20 Tourism Meet

జీ-20 టూరిజం (G20 Tourism) సమావేశాలకు గోవా (Goa) సిద్ధ‌మైంది. సోమ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. తొలి రెండు రోజులు జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ (G20 tourism working group) సమావేశాలు జ‌రుగుతాయి. చివరి రెండ్రోజులు జీ-20 టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జ‌రుగుతుంది. జీ-20 టూరిజం స‌మావేశాల‌కు ఇప్పటికే జీ-20 ప్రతినిధులు గోవాకు చేరుకున్నారు. సుస్థిర, బాధ్యతాయుత క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించే ఈవెంట్లతో జీ-20 సమావేశాలు జ‌రుగుతాయి.

ప్రపంచం పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలు అనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జ‌రుగుతుంది. ఇదివరకు జరిగిన జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి పరస్పర సహకారంపై ఉమ్మడి ప్రకటనను వర్కింగ్ గ్రూప్ ఆమోదించ‌నుంది. గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాలు, పర్యాటక రంగంలో ఎంఎస్ఎంఈలు, టూరిజం డెస్టినేషన్ అనే ఐదు అంశాలపై ప్రధాన చర్చ జ‌రుగుతుంది. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగం ప్రాధాన్యతల గురించి కూడా ఈ స‌మావేశాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. జూన్ 20న ప్రారంభ సమావేశంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్, కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లు పాల్గొంటారు.

ఈ సమావేశాల్లో భాగంగా ల్యాంప్ డాన్స్, కథక్, గోవా మాండో మ్యూజిక్ అండ్ డాన్స్, దేఖ్నీ డాన్స్, ముసల్ ఖేల్, గోమంత్ రంగ్ వంటి గోవా సాంస్కృతిక వారసత్వం చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. జీ-20 ప్రతినిధులను ఆహ్వానించేందుకు గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవా సంగీతం, నృత్యాలు, ఫ్లెమెన్కో ప్రదర్శనలతో ప్ర‌తినిధుల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతారు. రాష్ట్ర మంతటా జీ-20 పోస్టర్లు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. జీ-20 సమావేశాల్లో భాగంగా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జ‌రుగుతాయి.

Wrestlers Protest: మ‌హిళా రెజ్ల‌ర్లు సాక్షిమాలిక్‌, బ‌బితా ఫోగ‌ట్ మ‌ధ్య మాట‌ల యుద్ధం.. అస‌లేం జ‌రిగిందంటే?