Site icon HashtagU Telugu

Go First: గో ఫస్ట్‌ విమానంలో ఏం జరిగిందంటే.. ప్రయాణికుల ఆగ్రహం!

Air Craft Mock Up Gofirst Fin 916x513

Air Craft Mock Up Gofirst Fin 916x513

Go First: ఇటీవల విమానయాన సంస్థల తీరు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు విమాన చార్జీల రేట్లు విపరీతంగా పెంచేస్తున్నాయి. మరోవైపు విమానయాన సంస్థలు ప్రయాణికులపై వ్యవహరిస్తున్న తీరు దారుణంగా మారుతోంది. ఇక విమానాల్లో కొందరి ప్రవర్తన కూడా ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

విమాన సేవలపై ఇటీవల వరుసగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో మరో ఘటన వెలుగు చూసింది. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. గోఫస్ట్‌ విమానయాన సంస్థకు చెందిన G8 116 విమానం.. సుమారు 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసి టేకాఫ్‌ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఊహించని ఈ ఘటనతో విమానాశ్రయంలో కలకలం రేగింది. అక్కడే కూర్చుండిపోయిన మిగిలిపోయిన మిగతా ప్రయాణికులు సోషల్‌ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థపై అసహనం ప్రదర్శించారు. గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కొంత మంది ట్విట్టర్లో చేసిన ట్వీట్లకు గో ఫస్ట్‌ సంస్థ స్పందించింది.

చింతిస్తున్నాం.. వివరాలివ్వండి..
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి బాధ్యత వహిస్తున్నట్లు సదరు విమానయాన సంస్థ తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, బాధిత ప్రయాణికులు తమ వివరాలను వెల్లడించాలని కోరింది. గో ఫస్ట్‌ సంస్థతో ఇది అత్యంత భయానకంగా ఎదురైన అనుభవమని శ్రేయా సిన్హా అనే ప్రయాణికురాలు వాపోయింది. ఉదయం 6.20 గంటలకు విమానం ఉండగా.. 50 మందికిపైగా ప్రయాణికులు ఉదయం 5.35 గంటలకే బస్సు ఎక్కారని.. అయితే, గంటపాటు అందులోనే ఉంచారని ప్రయాణికులు మండిపడ్డారు. ఇది నిర్లక్ష్యానికి పరాకాష్టగా ప్రయాణికులు మండిపడ్డారు. ఇలా ఓ బస్సులోని ప్రయాణికులే విమానంలోకి ఎక్కారని, మరో బస్సులోని మొత్తం ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని ఇంకో ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ప్రధానికి, కేంద్ర మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ఫిర్యాదు చేశారు. అయితే, తర్వాత వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సదరు సంస్థ తెలిపింది.