Gulam Nabi Azad : జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ.. పార్టీ ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్‌..!

జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావించ‌నుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 11:04 AM IST

జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావించ‌నుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ అంశంపై మీడియా ఆజాద్‌ను ప్ర‌శ్నించింది. మీడియా ప్ర‌శ్న‌కు స్పందించిన ఆయ‌న.. నేడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పూర్తి వివ‌రాలు తెలుపుతాన‌ని వివ‌రించారు. దీంతో గులాం న‌బీ నేడు కొత్త పార్టీ పేరు ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

అయితే.. తన పార్టీ పేరు, జెండా జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌జ‌ల ఇష్టానికి అనుగుణంగానే ఉంటాయ‌ని తెలిపారు. పార్టీ పేరు గురించి కానీ.. ఇత‌ర విష‌యాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. పార్టీకి ఓ హిందుస్థానీ పేరు పెడతానని, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా ఆ పేరు ఉంటుందని చెప్పారు. జ‌మ్ముక‌శ్మీర్‌కు పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా వచ్చేందుకు మ‌రోసారి కృషి చేస్తానని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పార్టీ మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేస్తాన‌ని అన్నారు. తనపై, తన మద్దతుదారులపై విమర్శలు చేస్తూ తనకు చెడ్డ పేరు తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు చాలా ప్ర‌యత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నాయ‌క‌త్వంలోని పార్టీ ముందుగా జమ్ముకశ్మీర్‌తో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించబోతున్నారు.