కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాటుకు సంకేతాలు ఇస్తూ పార్టీ కీలక పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొద్దిసేపటికే ఆ పదవి నుంచి వైదొలిగారు. పార్టీ జమ్మూ కాశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా రాజీనామా చేశారు.ఆజాద్ ఇప్పటికే పార్టీ అఖిల భారత రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యునిగా ఉన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనేక ముఖ్యమైన పార్టీ పదవులను నిర్వహించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన జీ23 బృందంలో ఒకరు.
తన సన్నిహితుడు గులాం అహ్మద్ మీర్‌ను పార్టీ జమ్మూ కాశ్మీర్ విభాగం చీఫ్ పదవి నుంచి తొలగించిన కొద్దిసేపటికే ఆజాద్ రాజీనామా చేశారు. ఈ పరిణామం సంస్థాగతంగా కుదుపునకు గురిచేసింది. మీర్ స్థానంలో వికార్ రసూల్ వనిని పార్టీ నియమించింది. ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ అండ్ పబ్లికేషన్ కమిటీ, క్రమశిక్షణా కమిటీ మరియు ప్రదేశ్ ఎన్నికల కమిటీని తక్షణమే సోనియా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఓటర్ల జాబితా ఖరారు, డీలిమిటేషన్ కసరత్తు పూర్తయిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శీతాకాలం ముగిసేలోపు డీలిమిటేషన్, ఓటర్ల జాబితా సవరణ పూర్తి కానందున ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించలేమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలకు గడువు ఇంకా ప్రకటించాల్సి ఉంది.