Gautam Adani: మన చేతిలో లేని వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అంటున్నారు. తాను ఇదే సూత్రంపై ఆధారపడి పని చేస్తానన్నారు. గౌతమ్ అదానీ గతంలో చాలా ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడ్డారు. 1997లో గౌతమ్ అదానీ కిడ్నాప్ జరిగింది. ఇది కాకుండా, 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలోనూ అదానీ తాజ్ హోటల్‌లో చిక్కుకున్నారు.
బాధపడాల్సింది ఏమీ లేదు…
గౌతమ్ అదానీ శనివారం ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన కిడ్నాప్, 26/11 ముంబై దాడికి సంబంధించిన భయానక విషయాల్ని వివరించారు. తన జీవితంలో రెండు సార్లు మరణాన్ని చాలా దగ్గరగా చూశానని గౌతమ్ అదానీ చెప్పారు. తన కిడ్నాప్ గురించి గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘చెడు సమయాన్ని మరచిపోవడమే మంచిది. ప్రతి పరిస్థితికి నన్ను నేను అలవాటు చేసుకుంటాను. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే నన్ను విడుదల చేశారు. కానీ నేను అపహరణకు గురైన రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను. ఎందుకంటే చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా చింతించడం వల్ల ప్రయోజనం ఉండదు” అని వివరించారు.అదానీ మాట్లాడుతూ.. “ఎవరూ తమ చేతిలో లేని దాని గురించి ఆందోళన చెందకూడదని నేను నమ్ముతాను. విధి తనంతట తానుగా అన్నీ నిర్ణయించుకుంటుంది” అని చెప్పారు.
తాజ్ హోటల్‌లో ఎలా గడిపామంటే..
2008 నవంబర్ 26న ఉగ్రదాడి సమయంలో తాజ్ హోటల్‌లో తాను కూడా ఉన్నానని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఏదోలా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. దుబాయ్‌కి చెందిన ఒక స్నేహితుడితో కలిసి తాజ్ హోటల్‌కు భోజనానికి వెళ్లానని తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపే భయానక దృశ్యాన్ని చాలా దగ్గరగా చూశాను. కానీ భయపడలేదు.. ఎందుకంటే భయపడటం వల్ల ఏమీ జరగదు.
ఆ సంఘటన గురించి వివరిస్తూ.. “హోటల్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లబోతుండగా, ఉగ్రవాద దాడి జరిగిందనే వార్త తెలిసింది. ఆ రోజు రాత్రంతా భయాందోళనలో హోటల్ రూమ్ లోనే గడిపాను. నేను ఒకవేళ కొన్ని నిమిషాల ముందు రూమ్ బయటికి వెళ్లి ఉంటే, బహుశా ఏదైనా చెడు జరిగి ఉండేది. చివరకు హోటల్ సిబ్బందితో కలిసి మేడపైకి వెళ్లాను. మరుసటి రోజు ఉదయం 7 గంటల తర్వాత కమాండోల రక్షణ లభించడంతో మేం హోటల్ బయటికి బయలుదేరగలిగాం” అని వివరించారు.
విజయానికి కీలకం అదే..
కష్టపడి పనిచేయడం ఒక్కటే విజయానికి కీలకం అని గౌతమ్ అదానీ అన్నారు.దేశంలోని 22 రాష్ట్రాల్లో తమ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు. తనపై కొందరు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే అలాంటి ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ బిడ్డింగ్ లేకుండా ఏ వ్యాపారంలోకి ప్రవేశించలేదని ఆయన చెప్పారు. ఓడరేవు, విమానాశ్రయం, పవర్ హౌస్ ఇలా అన్ని చోట్లా నిబంధనల ప్రకారం పనులు జరిగాయన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడని, ఆయన కూడా దేశ ప్రగతిని కోరుకుంటున్నారని, ఆవేశంతో ఏదైనా మాట్లాడినా అభివృద్ధికి వ్యతిరేకం కాదని గౌతం అదానీ అన్నారు. రాజస్థాన్‌లోని అదానీ ప్రాజెక్టును కూడా రాహుల్ ప్రశంసించారని గుర్తు చేశారు.