Galwan : జై జవాన్.. గాల్వాన్ హీరో సంతోష్ బాబుకు మహావీరచక్ర!

‘‘చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లల్లో బెరుకు ఉండకూడదు. నా మూతిమీద చిరునవ్వు ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్’’.. ఈ డైలాగ్ దివంగత కల్నల్ సంతోష్ బాబుకు అతికినట్టుగా సరిపోతాయి. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా.. చావుకు దగ్గరలో ఉన్నా కూడా వెనకడగు వేయని ధీరత్వం ఆయనది.

  • Written By:
  • Updated On - November 23, 2021 / 03:34 PM IST

చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పేరు దేశ వ్యాప్తంగా ఇప్పటికీ మార్మోగుతోంది. దేశ రక్షణ కోసం ఆయన చూపిన తెగువ, ఓ వైపు ప్రాణాలు పోతాయని తెలిసినా.. అక్కడి నుంచి కదలకుండా చూపిన నిబద్ధత గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. చైనా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన గాల్వన్ హీరో అనగానే సంతోష్ బాబు గుర్తుకువస్తారు. ఆ దాడుల్లో ఆయన చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఎంతోమందిని కంటతడి పెట్టించింది. గాల్వాన్ వ్యాలీ హీరో కల్నల్ సంతోష్ బాబుకు మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండవ అత్యున్నత యుద్ధకాల శౌర్య పతకాన్ని మహావీర చక్ర (మరణానంతరం) ప్రదానం చేశారు. లడఖ్ సెక్టార్‌లోని గాల్వాన్ లోయలో ఆపరేషన్ స్నో లెపార్డ్‌లో శత్రువులను ఎదుర్కొంటూ చైనా ఆర్మీ దాడిని ఎదిరించినందుకు సంతోష్‌బాబుకు శౌర్య పతకాన్ని అందించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును అందుకున్నారు.

” గాల్వాన్ వ్యాలీ (తూర్పు లడఖ్)లో మోహరించిన బీహార్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బికుమల్ల సంతోష్ బాబు శత్రువులను ఎదుర్కొనేందుకు భారత్ బార్డర్ వద్ద ప్రత్యేక దళాలకు బాధ్యత వహించాడు. భారత్-చైనా సరిహద్దు వద్ద శత్రువర్గాలను తిప్పికొట్టాడు. అయితే ప్రత్యర్థులు పదునైన ఆయుధాలతో పాటు భారీ రాళ్ల దాడితో దాడి చేసాడు. కల్నల్ సంతోష్ బాబు ఏమాత్రం భయపడకుండా దాడులకు తిప్పికొట్టారు. శత్రు సైన్యాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. గతేడాది జూన్‌లో గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దుర్మార్గపు దాడికి వ్యతిరేకంగా నాయబ్ సుబేదార్ నుదురామ్ సోరెన్, హవల్దార్ కె పళని, నాయక్ దీపక్ సింగ్ మరియు సిపాయి గుర్తేజ్ సింగ్‌లతో సహా ఇతర ఆర్మీ సిబ్బంది వారి వీర చక్రాలను (మరణానంతరం) అందుకుంటారు.

చాలా కాలంగా ఇరు పక్షాల మధ్య జరిగిన భీకర ఘర్షణలో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. చైనీయులు కూడా  భారీ నష్టాలను చవిచూశారు. అయితే ఈ ఘర్షణ తో భారత్ మరింత బలపడింది. చైనా దళాలచే అసాధారణమైన ఆయుధాలను ఉపయోగించిన తర్వాత పెట్రోలింగ్ సమయంలో ఆయుధాలను ఉపయోగించడానికి దళాలకు అనుమతించింది.