G20 Summit Delhi : G20 సదస్సుకు ముస్తాబవుతున్న ఢిల్లీ.. ఆ సేవలపై నిషేధం.. వారికి సెలవులు..

G 20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు(Delhi Police) కొన్ని ఆంక్షలు విధించారు.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 10:00 PM IST

G 20 సదస్సు(G20 Summit)కు దేశ రాజధాని ఢిల్లీ(Delhi) ముస్తాబవుతోంది. ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహణకోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోపం లేకుండా చేస్తోంది. G 20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు(Delhi Police) కొన్ని ఆంక్షలు విధించారు. భద్రతా ఏర్పాట్ల రీత్యా ట్రాఫిక్ ఆంక్షలను(Traffic Ristrictions) అమలు చేస్తున్న క్రమంలో.. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలకు అనుమతి నిషేధించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ నగర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. G 20 సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలుంటాయని వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ డెస్క్ అందుబాటులో ఉంటుందని, లాక్ డౌన్ తరహా కఠిన ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేశారు.

అలాగే.. G 20 సదస్సుకు హాజరయ్యే వీవీఐపీల భద్రతా దృష్ట్యా.. వారంతా ప్రయాణించే మార్గాల్లో మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం కోరింది. సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ అర్థరాత్రి వరకూ ఢిల్లీ నగరంలో కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ లో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించారు. ఇక ఈ సదస్సు నేపథ్యంలో.. నగరంలో 2 రోజుల పాటు మార్కెట్లు, దుకాణాలు, స్కూళ్లు, బ్యాంకులు, మద్యం దుకాణాలు, ఇతర వ్యాపారాలన్నీ మూతపడనున్నాయి. వ్యాపారస్తులు తమ ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులివ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఉన్న భారత్ మండపంలో జరిగే G 20 సదస్సుకు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. సుమారు లక్షమంది పోలీసులు ఢిల్లీ నగరమంతా పహారా కాయనున్నారు.

 

Also Read : Delhi Traffic Police : G20 సమావేశాలు.. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు