Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి అత్యవసర చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి రవాణా శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు రూ.1.5 లక్షల వరకూ నగదు రహిత వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు ప్రమాదం జరిగిన వెంటనే, గోల్డెన్ అవర్‌లో అందించాల్సిందిగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ విధానం ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం 2025’ పేరిట అమల్లోకి తీసుకువచ్చారు.
Read Also: Kailash Yatra: కైలాస మానస సరోవర యాత్ర.. అర్హతలు, ఖర్చులివీ
ఈ పథకం ప్రకారం, ఏ రహదారిలో జరిగినా, మోటారు వాహన ప్రమాదానికి గురైన బాధితుడు ఏ ఆసుపత్రిలో అయినా వైద్యం పొందవచ్చు. ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఏడు రోజుల వరకూ ఉచిత వైద్యం అందించాల్సి ఉంటుంది. ట్రామా మరియు పాలీట్రామా చికిత్స అందించగల ఆసుపత్రులన్నీ ఈ పథకానికి అనుబంధంగా పనిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితుడిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్యం ప్రారంభించాలి. సంబంధిత ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేకపోతే, బాధితుడిని మరో ఆసుపత్రికి తరలించాల్సిన బాధ్యత ఆయా ఆసుపత్రిదే కావాలని కేంద్రం స్పష్టం చేసింది. రవాణా కోసం అవసరమైన సౌకర్యాలను కూడా ఆసుపత్రులే కల్పించాలి.
బాధితుడి డిశ్చార్జ్ తర్వాత, వైద్యం అందించిన ఆసుపత్రులు సంబంధిత ఖర్చులను నిబంధనల ప్రకారం రూపొందించిన పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇందులో ప్యాకేజీలకు అనుగుణంగా బిల్లులు పరిశీలించబడతాయి. ఈ పథకం అమలులోకి రావడానికి మద్దతుగా, ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. గోల్డెన్ అవర్ లోపల బాధితులకు అత్యవసర వైద్యం అందించడం అనివార్యమని కోర్టు పేర్కొనడం వల్ల కేంద్రం ఈ చర్యకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుతో ప్రమాదాల్లో గాయపడిన వారికి సమయానికి వైద్యం అందే అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.
Read Also: Mock drill : రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం