Free Me: నాకు మంత్రి పదవి వద్దు.. ఆ అధికారికే ఇచ్చేయండి.. రాజస్థాన్ లో ఓ మంత్రి ఆవేదన

ఎన్నికల్లో ఎలా గెలవాలా అని తలపట్టుకుంటున్న వేళ కాంగ్రెస్ కు మరికొన్ని కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Rajsthan Minister

Rajsthan Minister

ఎన్నికల్లో ఎలా గెలవాలా అని తలపట్టుకుంటున్న వేళ కాంగ్రెస్ కు మరికొన్ని కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ మంత్రి ఒకరు.. తనకు మంత్రి పదవి వద్దు.. ఆ అధికారికే ఇచ్చేయండి సీఎం సార్ అంటూ మొరపెట్టుకున్నారు. దీంతో ఉన్న మంత్రి పదవిని ఆయన ఎందుకు వదులుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది. రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ కు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు.

రాజస్థాన్ లోని బండి నియోజకవర్గం ఎమ్మెల్యే అశోక్ చంద్నా మంత్రిగా చేస్తున్నారు. ఆయన క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్ డెవలప్ మెంట్, ఉపాధి, డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖలను నిర్వహిస్తున్నారు. కానీ తాను పేరుకే మంత్రిగా ఉన్నానని.. తన శాఖల్లో అధికారుల జోక్యం బాగా పెరిగిపోయిందని ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల తాను ఏ నిర్ణయాలను తీసుకోలేకపోతున్నానని.. తనకు ప్రాధాన్యతే లేదని వాపోయారు. మంత్రిగా తనకు గౌరవం లేనప్పుడు ఆ పదవి తనకెందుకు అని సీఎంను ప్రశ్నించారు మంత్రి అశోక్ చంద్నా.

సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కుల్దీప్ రంకా జోక్యం తన శాఖల్లో పెరిగిపోయిందని అశోక్ చంద్నా ఆరోపించారు. అందుకే ఆయనకే తన శాఖలన్నీ అప్పజెప్పేయండని సీఎంను కోరారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించండని అశోక్ చంద్నా ఆవేదన చెందడంతో రాజస్థాన్ లో ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి వివాదాల వల్ల ఎమ్మెల్యేలు, మంత్రులు కాని మనస్తాపానికి గురైతే.. అది పార్టీ విజయావకాశాలపై దారుణంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది.

  Last Updated: 27 May 2022, 12:01 PM IST