Site icon HashtagU Telugu

UP Assembly Election 2022: యూపీలో నాలుగో ద‌శ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజ‌క‌వ‌ర్గం పైనే అంద‌రి దృష్టి..!

Uttar Pradesh Elections Fourth Phase

Uttar Pradesh Elections Fourth Phase

ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు నేప‌ధ్యంలో ఈరోజు అక్క‌డ‌ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ క్ర‌మంలో నేడు మొత్తం 59 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమ‌య్యింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 9 జిల్లాలైన లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో ఈ నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నాలుగో ద‌శలో మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఈ దశలో జరుగుతున్న నియోజకవర్గాల్లో అధికార బీజేపీకి మంచి పట్టుంది.

గత ఎన్నికల్లో ఈ 59 స్థానాల‌కు గానూ, 51 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా సేమ్ రిజ‌ల్ట్ రిపీట్ అవుతుంద‌ని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే మ‌రోవైపు స‌మాజ్ వాదీ పార్టీ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగానే క‌నిపిస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌వ‌లం నాలుగు స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించిన సమాజ్ వాదీ పార్టీ, ఈసారి 40కి పైగా స్థానాల్ని కైవ‌శం చేసుకుంటామ‌ని ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ధీమా వ్య‌క్తం చేశారు. ఈ నేప‌ధ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. కోవిడ్ నేప‌ధ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని, పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే అక్క‌డ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ తిరుగులేని విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కావడంతో అన్ని రాజకీయ పార్టీలు పూర్తి బలాన్ని చాటుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో సీఎం యోగి దూసుకుపోతున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్‌తో పాటు ఇత‌ర పార్టీల‌ను లైట్ తీసుకున్న‌ బీజేపీ ఎక్కువ‌గా స‌మాజ్ వాదీ పార్టీని టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలో ఈ 59 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ అని అక్క‌డి రాజ‌కీయ‌విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌చారంలో కూడా బీజేపీ అండ్ ఎస్పీ పార్టీల నాయ‌కులు హైవోల్టేజ్ వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌రి పై మ‌రొకరు మాట‌ల తూటాలు పేల్చారు.

ఇక మ‌రోవైపు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా నాలుగో ద‌శ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అనేక ర్యాలీలు నిర్వహించి ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెక్ పెట్టాల‌ని అక్క‌డి ఓట‌ర్ల‌ను కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా భారీగానే ప్ర‌చారం సాగించింది. యూపీ ఇంచార్జ్‌గా ఉన్న ప్రియాంక్ గాంధీ ఆద్వ‌ర్యంలో ప‌లు ప్రాంతాల్లో రోడ్ షోలు, స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించి అక్క‌డ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగింది. మ‌రి అక్క‌డి ఓట‌ర్లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో చూడాలి. ఇక గ‌త ఏడాది అక్టోబర్ 3న జ‌రిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందిన లఖింపూర్ ఖేరీ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా నాలుగో దశలోనే పోలింగ్ జరగనుంది. దీంతో ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి ఈ నియోజ‌క‌వ‌ర్గం పైనే ఉంది. ఈ నేప‌ధ్యంలో ఈరోజు పోలింగ్ ట్రెండ్ ఎలా ఉంటుందనేది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉత్కంఠతగా మారింది.