Tamilisai Soundararajan: బీజేపీలో చేరిన తమిళిసై సుందరరాజన్

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సుందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సుందరరాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె తన పదవిని వదులుకున్నారని రాజకీయాల్లో చర్చ నడిచింది. అందరు భావించినట్టుగానే ఆమె ఈ రోజు బీజేపీ గూటికి చేరారు.

తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె.అన్నామలై చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలాలయం’లో తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ సభ్యత్వ కార్డును అందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ తన పదవిని వదులుకోవడం చాలా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ, తిరిగి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. గవర్నర్‌గా నాకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. గవర్నర్ పదవిని వదులుకున్నందుకు ఒక్క శాతం కూడా చింతించడం లేదు. తెలంగాణలో ఎన్నో సవాళ్లను చూశానన్నారు.

తమిళనాడులో కమలం తప్పకుండా వికసిస్తుందని చెప్పారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ రాష్ట్రానికి సహకరించాలనే ఉద్దేశంతో తమిళిసై తన పదవిని వదులుకున్నారని అన్నారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకోనుంది. అందుకే రాజకీయాల్లో ఉంటూ బీజేపీకి సహకరించాలని తమిళసై అనుకుంటున్నారని తెలిపారు. ఆమెకు ప్రజలు, బీజేపీ పార్టీపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. కాగా సుందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు.తన రాజీనామాను ఆమోదించిన తర్వాత, ప్రెసిడెంట్ ముర్ము జార్ఖండ్ గవర్నర్ సి పి రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్ గా నియమించారు.

Also Read: IPL 2024: ఐపీఎల్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?