Unclaimed Bodies Sold : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లో సదరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పదవికి డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయనను సీబీఐ ప్రశ్నిస్తోంది. త్వరలోనే ఆయనకు లై డిటెక్టర్ టెస్టు కూడా నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు విచారణలో సందీప్ ఘోష్ ఇచ్చిన సమాధానాల్లో ఎన్ని నిజం ? ఎన్ని అబద్దం ? అనేది నిర్ధారించుకునందుకు పాలీ గ్రాఫ్ టెస్టు చేయించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారట. ఇప్పటికే సందీప్ ఘోష్‌పై బెంగాల్ పోలీసులు అవినీతి కేసు నమోదు చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో పనిచేసిన మాజీ అధికారి డాక్టర్ అక్తర్ అలీ.. సందీప్ ఘోష్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా అక్తర్ అలీ వ్యవహరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వాడేసిన సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటి సామగ్రిని కూడా రీసైక్లింగ్ చేయించి డాక్టర్ సందీప్ ఘోష్ సొమ్ము చేసుకునేవాడని డాక్టర్ అక్తర్ అలీ ఆరోపించారు. కాలేజీ ప్రిన్సిపల్ పదవిని సందీప్ పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలకుగానూ గతంలో సందీప్‌పై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని అక్తర్ అలీ గుర్తు చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ప్రతీ రెండు రోజులకు సగటున 500 నుంచి 600 కిలోల సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు పోగయ్యేవని ఆయన తెలిపారు. ఆ సామగ్రిని ఇద్దరు బంగ్లాదేశీయుల సాయంతో డాక్టర్ సందీప్ ఘోష్(Unclaimed Bodies Sold) రీసైక్లింగ్ చేయించేవాడన్నారు. ఈ అంశంపై అప్పట్లోనే తాను విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్‌మెంట్లకు ఫిర్యాదు చేశానని అక్తర్ అలీ వివరించారు.
Also Read :Trai : స్పామ్ కాల్స్, మెసేజ్‌లు చేసే వాళ్ల కనెక్షన్లు పీకేయండి.. ట్రాయ్ ఆదేశాలు
బయోమెడికల్ వ్యర్థాలు, వైద్య సామగ్రిని సైతం ఇతర దేశాలకు సందీప్ రవాణా చేసేవాడని తెలిపారు. చివరకు ఆస్పత్రిలో ఉండే అనాథ శవాలతో కూడా డాక్టర్ సందీప్ ఘోష్ వ్యాపారం చేసేవాడని, వాటిని అమ్ముకొని డబ్బులు తీసుకునేవాడని డాక్టర్ అక్తర్ అలీ సంచలన ఆరోపణ చేశారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై తాను 2023 సంవత్సరం జులై 14నే ఉన్నతాధికారులకు లెటర్ రాశానన్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్తులను ఇష్టానుసారంగా లీజుకు ఇచ్చేవాడని చెప్పారు. వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరా కాంట్రాక్టులను తన బంధువులకే ఇచ్చుకునే వాడన్నారు. ఈ కాంట్రాక్టులు ఇచ్చినందుకు ప్రతిగా వారి నుంచి 20శాతం కమిషన్ తీసుకునేవాడని తెలిపారు. కాలేజీలో పరీక్ష ఫెయిలైన విద్యార్థుల నుంచి సొమ్ములు దండుకొనేవాడని అక్తర్ అలీ పేర్కొన్నారు.