Rajiv Gandhi Death Anniversary : ఇవాళ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 33వ వర్థంతి. ఈ సందర్భంగా ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. ఇక ప్రధాని మోడీ కూడా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా దీనిపై పోస్ట్ చేశారు. ‘మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి నా నివాళులు’ అని పోస్టులో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తన తండ్రి రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. తన తండ్రితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను ఆ పోస్ట్‌లో జతపరిచారు. అందులో రాహుల్ భుజాలపై రాజీవ్ గాంధీ చేయి వేసుకుని కనిపిస్తారు. ‘‘నాన్న.. మీ కలలు, నా కలలు, మీ ఆకాంక్షలు, నా బాధ్యతలు. మీ జ్ఞాపకాలు, ఈ రోజు, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటాయి’’ అని రాహుల్ ఉద్వేగంగా రాసుకొచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి పి చిదంబరం, సచిన్ పైలట్, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా దేశ రాజధానిలో నివాళులర్పించారు.
पापा,
आपके सपने, मेरे सपने,
आपकी आकांक्षाएं, मेरी ज़िम्मेदारियां।आपकी यादें, आज और हमेशा, दिल में सदा। pic.twitter.com/lT8M7sk7dS
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2024
We’re now on WhatsApp. Click to Join
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడిలో అమరులయ్యారు. శ్రీపెరంబుదూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేముందు ప్రజల అభివాదాలను స్వీకరిస్తూ రాజీవ్ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తన దుస్తులలో పేలుడు పదార్థాలను దాచుకున్న లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్‌టీటీఈ)కు చెందిన మహిళా ఉగ్రవాది రాజీవ్ గాంధీ పాదాలను తాకి, సూసైడ్ బాంబును పేల్చుకుంది. వెంటనే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ ఎత్తు పొగ బెలూన్‌లా పైకి లేచింది. ఈ ఘటనలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో సహా పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు.