మే 10న జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారే ప్రక్రియ సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ మాజీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి (Former Deputy CM) లక్ష్మణ్ సవాది (Laxman Savadi) కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం (ఏప్రిల్ 14) డీకే శివకుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. పార్టీ (బీజేపీ) దాని సూత్రాలను పాటించడం లేదు. అధికార రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. పాత బీజేపీ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. అదే సమయంలో ఇండియా టుడే ప్రకారం.. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు “నేను బిజెపితో నా ప్రయాణాన్ని ముగించాను. నేను చనిపోయిన తర్వాత కూడా నా మృతదేహాన్ని బిజెపి కార్యాలయం ముందు తీసుకెళ్లకూడదు” అని అన్నారు.
బీజేపీ ఎన్నికల అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 12న విడుదల చేసిన బీజేపీ రెండో జాబితాలోనూ లక్ష్మణ్ సవాడి పేరు లేదు. అథని అసెంబ్లీ స్థానం నుంచి సవాడి టికెట్‌ను బీజేపీ రద్దు చేసింది. ఆ తర్వాత ఆయన శాసనమండలి సభ్యత్వానికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయపరమైన విభేదాలున్నప్పటికీ తాను కాంగ్రెస్ నేతలను కలిసినప్పుడు వారు సాదరంగా ఆహ్వానించారని, అందుకు తాను కృతజ్ఞుడినని సవాది పేర్కొన్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకముంచిన పార్టీ మేలు కోసం తన చేతనైనంత కృషి చేస్తానని పేర్కొన్నారు.
కర్ణాటకలో ఫిరాయింపులు
మే 10న రాష్ట్రంలో ఓటింగ్ నిర్వహించి మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే నేతలు ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత గోవిందాచార్ రఘు ఆచార్ జేడీఎస్‌లో చేరారు. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ టికెట్ల పంపిణీ జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన జేడీఎస్‌లో చేరినట్లు కూడా చెబుతున్నారు.