గత 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమెతో అమానుషంగా ప్రవర్తించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు. అమ్మతనానికి నోచుకోకుండా అడ్డుకున్నాడు.అయినా సహనంతో భరించింది. చివరకు అతగాడు పెళ్లికి కూడా నిరాకరించాడు. దీంతో బాధిత మహిళ (33) మనో వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గత తొమ్మిదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలితో బీహార్‌కు చెందిన గౌతమ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఈ 8 ఏళ్లలో ఆమెకు 14 సార్లు అబార్షన్ చేయించాడు. చివరకు పెళ్లికి నిరాకరించడంతో ఆమె జులై 5న ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. పోస్టుమార్టం సమయంలో ఆమె దుస్తుల్లో సూసైడ్ నోట్ లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. “నన్ను మోసం చేసిన వ్యక్తి ఫోన్‌ను చెక్ చేయండి” అని ఆ సూసైడ్ నోట్‌లో బాధిత మహిళ ప్రస్తావించింది. నిందితుడు నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మహిళ భర్తను కూడా విచారించామని.. ఇద్దరు ఎనిమిదేళ్ల క్రితం విడిపోయినట్లు పేర్కొన్నాడని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.