Road Accident : ఢిల్లీ- ఆగ్రా రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఆటోను ఢీ కొట్టడంతో.. ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. ఆగ్రా సమీపంలోని గురుద్వారా గురు కా తాల్ వద్ద ఆటో రోడ్డును క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. సమీపంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రగాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా నేషనల్ హైవే 19పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురుద్వారా గురు కా తాల్ క్రాసింగ్ వద్ద ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని, ఈ ప్రాంతంలో అండర్‌పాస్ నిర్మించాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నా ప్రభుత్వం మాత్రం చేయలేదు.