First Visuals : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో ఈనెల 12న చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని బయటికి తీసేందుకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పది రోజులుగా వారంతా సొరంగంలోని శిథిలాల కిందే చిక్కుకుపోవడంతో.. ఎలా ఉన్నారో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో 41 మంది కార్మికుల క్షేమ సమాచారం ఒకటి బయటికి వచ్చింది. వారంతా సొరంగంలో చిక్కుకున్న ప్రదేశానికి సంబంధించిన ఒక వీడియో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. కార్మికులంతా క్షేమంగానే ఉన్నట్లు అందులో స్పష్టంగా కనిపిస్తోంది. టన్నెల్ వద్ద రెస్క్యూ వర్క్స్ నిర్వహిస్తున్న అధికారులు కెమెరాను సొరంగం లోపలికి పంపించి, కార్మికులతో లైవ్‌లో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ఉదయం ట్విట్టర్‌లో షేర్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
सिलक्यारा, उत्तरकाशी में निर्माणाधीन सुरंग के अंदर फँसे श्रमिकों से पहली बार एंडोस्कोपिक फ्लेक्सी कैमरे के माध्यम से बातचीत कर उनका कुशलक्षेम पूछा गया। सभी श्रमिक बंधु पूरी तरह सुरक्षित हैं। pic.twitter.com/vcr28EHx8g
— Pushkar Singh Dhami (@pushkardhami) November 21, 2023
ఈనెల 12న సొరంగంలో చిక్కుకున్నప్పటి నుంచి బయటి ప్రపంచంతో 41 మంది కార్మికులు మాట్లాడటం ఇదే తొలిసారి. సొరంగంలో కార్మికులు చిక్కుకున్న ప్రదేశం దాకా సోమవారం రాత్రి 6 అంగుళాల ఒక పైపును ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లలో అందరికీ ఆహార పదార్థాలను పంపిస్తున్నారు. తాజాగా ఇదే పైపు ద్వారా అధికారులు ఎండోస్కోపిక్ కెమెరాను సొరంగం లోపలికి పంపారు. దాని ద్వారానే కార్మికులంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడారు. తామంతా బాగానే ఉన్నామని చెప్పారు. ఈ విజువల్స్‌లో కార్మికులు తమ హార్డ్ టోపీలు, వర్క్ గేర్‌లో కనిపించారు. రెస్క్యూ అధికారులు వాకీ టాకీస్, రేడియో హ్యాండ్‌సెట్‌ల ద్వారా కార్మికులతో మాట్లాడటం, కెమెరా ముందుకు రావాలని కార్మికులకు సూచించడం ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం సొరంగాన్ని కుడి, ఎడమ వైపుల నుంచి అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. దీంతోపాటు నిలువుగా డ్రిల్లింగ్ చేసే ఆపరేషన్ కూడా మొదలైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, డీఆర్డీఓ, ఐటీబీపీ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం తమవంతుగా సహాయాన్ని(First Visuals) అందిస్తున్నాయి.