Lok Sabha First Session : ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఆదివారం (జూన్ 9న) సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇదే సమయంలో పలువురు కీలక ఎన్డీయే నేతలు కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఆ వెంటనే కేంద్ర కేబినెట్ తొలిసారిగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఘట్టం జరిగిన తర్వాత 18వ లోక్‌సభ తొలి సెషన్ నిర్వహణకు రంగం సిద్దం కానుంది. ఈసారి లోక్‌సభ తొలి సెషన్ జూన్ 15న ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన వారితో తొలుత రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ముగిసిన అనంతరం కొత్త స్పీకర్‌ను ఎంపిక చేస్తారు. స్పీకర్ ఎన్నిక జరిగాక.. మరుసటి రోజున లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. దీంతో పార్లమెంటు సెషన్ అధికారికంగా ప్రారంభమవుతుంది. పార్లమెంటు సమావేశాల నిర్వహణ తేదీలపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈ సెషన్‌లోనే ప్రధాని మోడీ తన మంత్రిమండలి సభ్యులను ఉభయ సభలకు పరిచయం చేస్తారు. జూన్ 22న పార్లమెంటు సమావేశాలు(Lok Sabha First Session) ముగిసే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
- మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు 3 ప్రత్యేక హోటళ్లు సిద్ధం చేశారు. ఆయా చోట్ల ప్రోటోకాల్‌ను అమలు చేస్తున్నారు.
- ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.జూన్ 9, 10 తేదీల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయి.
- పారామోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లతోపాటు పారాగ్లైడింగ్ చేయడం, డ్రోన్లు, గాలి బుడగలు, రిమోటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఢిల్లీలో ఎగురవేయడాన్ని నిషేధించారు.