Site icon HashtagU Telugu

UP Election 2022: యూపీలో ప్ర‌జాతీర్పు ఎలా ఉంటుందో.. టెన్ష‌న్‌లో రాజ‌కీయ పార్టీలు..!

Up Elections 789

Up Elections 789

ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనున్న నేప‌ధ్యంలో, నేడు తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. మొద‌ట దేశంలో అతి పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో మొత్తం 11 జిల్లాల్లోని, 58 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే పోలింగ్ ప్రారంభ‌మైంది. యూపీ లోని తొలిదశ ఎన్నికల్లో దాదాపు 2.27 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారని స‌మాచారం. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ప‌లు ప్రాంతీయ పార్టీలు తలపడుతున్నాయి. ఇప్ప‌టికే మొద‌లైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది.

ఇక తొలిదశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా పరిస్థితులు ఉన్నా నేప‌ధ్యంలో, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కోవిడ్ నిబంధనలను పాటించేలా ఎన్నిక‌ల అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓట‌ర్లు భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ముఖ్యంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ప్ర‌జ‌లు కోవిడ్ ప్రోటోకాల్‌ని పాటిస్తూ, త‌మ‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇక ఈసారి యూపీ ఎన్నిక‌ల యుద్ధంలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశముందని, అక్క‌డి రాజ‌కీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నట్లు రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ నుండి ఈసారి యూపీలో ప్రియాంక గాంధీ నాయకత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పోతే 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. యూపీలో మొత్తం 403 సీట్లు ఉండ‌గా, అందులో బీజేపీ అండ్ ఆ పార్టీ మిత్ర ప‌క్షాలు 312 స్థానాలను కైవ‌శం చేసుకున్నాయి. ఈసారి కూడా సేమ్ రిజ‌ల్ట్ రిపీట్ అవుతోంద‌ని బీజేపీ కూటమి కాన్ఫిడెన్స్‌గా ఉంటే, మ‌రోవైపు బీజేపీని చిత్తుగా ఓడిస్తామని అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తుంది. మ‌రి యూపీలో ప్ర‌జాతీర్పు ఎలా ఉంటుందో అని ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న అన్ని రాజ‌కీయ పార్టీల్లో టెన్ష‌న్ నెల‌కొంది.