Site icon HashtagU Telugu

Made in India: త్వరలోనే మేడిన్‌ ఇండియా చిప్‌.. ఏమిటిది ? ఎవరు తయారు చేస్తారు?

Made In India Chip Semiconductor Chip Manufacturing

Made in India: ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌ కూడా రాబోతోంది. అది కూడా ఈ ఏడాదిలోనే. 2025 సంవత్సరం సెప్టెంబర్‌-అక్టోబరుకల్లా తొలి మేడిన్‌ ఇండియా చిప్‌ వచ్చేస్తుందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా ప్రకటించారు. ఈనేపథ్యంలో మేడిన్‌ ఇండియా చిప్‌ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Solar Power: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?

భారత్‌కు ఎందుకీ చిప్ ?

మన భారతదేశం చాలా రంగాల్లో స్వావలంబన సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే మనం అంతరిక్ష రంగం, రక్షణ రంగంలో ఎన్నో ఉత్పత్తులను సొంతంగా తయారు  చేసుకుంటున్నాం. ఆయా ఉత్పత్తులు, సేవలను వివిధ ప్రపంచ దేశాలకు విక్రయిస్తున్నాం కూడా.  సెమీ కండక్టర్ల రంగంలో కూడా  స్వావలంబన సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలోనే మేడిన్ ఇండియా  సెమీ కండక్టర్ చిప్‌‌(Made in India) తయారీపై భారత సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తైవాన్‌కు చెందిన పవర్‌చిప్‌ సెమీకండక్టర్‌ మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీతో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గుజరాత్‌లోని దొలేరాలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ను నిర్మిస్తోంది. వీటిలో ఉపయోగించే గాలియం నైట్రైడ్‌‌కు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)కు కేంద్ర ప్రభుత్వం రూ.334 కోట్లను మంజూరు చేసింది. మొహాలీలోని సెమీకండక్టర్‌ ల్యాబ్‌ ఆధునీకరణ ఇంకా పెండింగ్‌ దశలోనే ఉంది. ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ISM) 1.0 అమలవుతోంది. అది పూర్తయ్యాక ISM 2.0 కోసం కేంద్ర సర్కారు పనిచేయనుంది. మన దేశంలోని 234 యూనివర్సిటీల్లోని విద్యార్థులకు అధునాతన సెమీకండక్టర్‌ డిజైన్‌ సాధనాలను అందిస్తున్నారు.

భారత్‌లో చిప్‌ల తయారీ దిశగా అడుగులివీ..

  • భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ కోసం  ఫాక్స్ కాన్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకోసం అది హెచ్‌సీఎల్  కంపెనీతో జట్టు కట్టింది.  4.24 బిలియన్ రూపాయలను ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెడతామని ప్రకటించింది.
  • టాటా ఎలక్ట్రానిక్స్, తైవాన్ కంపెనీ పీఎస్‌ఎంసీ  కంపెనీలు కలిసి గుజరాత్‌లోని థోలేరాలో సెమీ కండక్టర్  ఫ్యాబి యూనిట్ ఏర్పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.ఈ యూనిట్‌లో ఆటోమోటివ్, ఏఐ, వైర్‌లెస్ కమ్యూనికేషన్‌‌లకు అవసరమైన చిప్‌లను తయారు చేస్తారు.  ఈ యూనిట్‌లో 2026 నుంచి చిప్‌ల ఉత్పత్తి మొదలవుతుందని అంచనా.  ప్రతినెలా దాదాపు 50వేల చిప్‌ వేఫర్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారని అంచనా.
  • అదానీ గ్రూప్, ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీ కండక్టర్ కంపెనీ కలిసి భారత్‌లో సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నాయి.  ముంబై సమీపంలోని పన్వేల్‌లోని ఈ యూనిట్ ఏర్పాటవుతుంది.
  • ఎల్‌అండ్‌టీ కంపెనీ, కేంద్ర ప్రభుత్వం సహకారంతో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఆసక్తిగా ఉంది.  2027 నాటికి 15 రకాల సెమీ కండక్టర్ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేవాలని అది భావిస్తోంది. 
  • గుజరాత్, అసోంలలో టాటా ఎలక్ట్రానిక్స్‌కు ఇప్పటికే సెమీ కండక్టర్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకు అవసరమైన పరికరాలు, సేవల కోసం జపాన్‌కు చెందిన టోక్యో ఎలక్ట్రాన్ కంపెనీతో టాటా ఎలక్ట్రానిక్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.