Site icon HashtagU Telugu

Delhi Court Firing: ఢిల్లీ కోర్టు ఆవరణలో ఇప్పటివరకు జరిగిన కాల్పుల వివరాలు

Delhi Court Firing

Delhi Court Firing

Delhi Court Firing: నిన్న ఢిల్లీ కోర్టు ఆవరణలో సస్పెండ్ కు గురైన ఓ న్యాయవాది మహిళపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆ మహిళ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు చొచ్చుకుపోయాయి. ఢిల్లీలోని సాకేత్ కోర్టులో సస్పెండ్ కు గురైన న్యాయవాది కోర్టు ఆవరణలో ఒక మహిళను మొదట అసభ్యంగా ప్రవర్తించి, ఆపై ఆమెను వెంబడించి కాల్చి చంపిన తీరు ఆందోళనకు గురి చేస్తుంది. సస్పెండ్ అయిన లాయర్ మహిళపై మొత్తం నాలుగు బుల్లెట్లు కాల్చగా అందులో మూడు కడుపులో, చేతికి తగిలింది. అయితే ఢిల్లీలోని కోర్టుల్లో ఇలాంటి నేరపూరిత ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గత 9 సంవత్సరాలలో ఢిల్లీలోని వివిధ కోర్టులలో మొత్తం ఏడు నేర సంఘటనలు జరిగాయి, ఇందులో ఒక గ్యాంగ్‌స్టర్ మరియు ఒక పోలీసు మరణించారు.

ఢిల్లీ కోర్టుల్లో నేర సంఘటనలు:

22 ఏప్రిల్ 2022న రోహిణి కోర్టులో ఒక న్యాయవాది మరియు తన క్లయింట్ మధ్య వాగ్వాదం సందర్భంగా కాల్పులు జరిగాయి, ఇందులో ఇద్దరు న్యాయవాదులు గాయపడ్డారు. ఈ సంఘటన సుమారు ఏడాది క్రితం జరిగింది. ఉదయం 8.45 గంటలకు 7 వ గేట్ నంబర్ వద్ద న్యాయవాది మరియు అతని క్లయింట్ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదాన్ని ఆపేందుకు అక్కడ సెక్యూరిటీ పోలీస్ భూమిలోకి బుల్లెట్ పేల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు .

డిసెంబర్ 3, 2022న కర్కర్డూమా కోర్టులోని గేట్ నంబర్ 4 వద్ద అర్మాన్ అనే గ్యాంగ్‌స్టర్ గాలిలో కాల్పులు జరిపాడు. బుల్లెట్ పేలిన వెంటనే ఒక్కసారిగా కలకలం రేగింది. కోర్టు భద్రత కోసం మోహరించిన పోలీసులు ఆ దుండగుడిని అదుపు చేశారు. మీరట్‌లోని హసన్‌పూర్ గ్రామ నివాసి 21 ఏళ్ల అర్మాన్‌గా గుర్తించారు. అనంతరం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు .

9 డిసెంబర్ 2021న రోహిణి కోర్టు ఆవరణలోని బాంబు పేలుడు సంభవించింది. ఓ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించింది. కోర్టు హాలులో విచారణ జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. తక్కువ సామర్థ్యం గల బాంబు కారణంగా, పేలుడు సమయంలో న్యాయమూర్తి, న్యాయవాది మరియు కోర్టు గదిలో ఉన్న వ్యక్తులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో టిఫిన్ బాంబును గుర్తించారు పోలీసులు.

గ్యాంగ్‌స్టర్ జితేంద్ర అలియాస్ గోగి 24 సెప్టెంబర్ 2021న రోహిణి కోర్టు ఆవరణలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. రద్దీగా ఉండే కోర్టులో ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగీని దుండగులు కాల్చి చంపారు. ఈ గ్యాంగ్ వార్ లో గ్యాంగ్ స్టర్ తో సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు నలుగురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో గోగి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు. అప్పటికే లాయర్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు దుండగులు అతనిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

నవంబర్ 3 2019న తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ వివాదంపై పోలీసులు మరియు న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలో, న్యాయవాదికి బుల్లెట్ తగిలింది. ఆ తర్వాత పెద్దఎత్తున తోపులాట జరిగింది. దాదాపు గంటకు పైగా కోర్టు ఆవరణలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది పోలీసులు, ఒక అదనపు డీసీపీ, ఇద్దరు ఎస్‌హెచ్‌ఓలు గాయపడ్డారు. అలాగే ఎనిమిది మంది న్యాయవాదులు గాయపడ్డారు. ఈ ఘటనలో 12 ప్రైవేట్ బైక్‌లు, ఒక క్యూఆర్‌టీ పోలీసు జిప్సీ, ఎనిమిది జైలు వ్యాన్‌లను ధ్వంసం అయ్యాయి.

డిసెంబర్ 23, 2015న నలుగురు దుండగులు కర్కర్‌దూమా కోర్టులోకి ప్రవేశించి కాల్పులు జరపగా.. ఈ ఘటనలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ మరణించాడు.

Read More: CBN : చంద్ర‌బాబుపై రాళ్ల దాడి వెనుక పొలిటిక‌ల్ కుట్ర‌?