India Pakistan Tensions : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్న తరుణంలో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి శుక్రవారం ప్రకటించారు. ప్రజలందరూ ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: 500 Drones: 210 నిమిషాలు.. 500 డ్రోన్‌లు.. పాకిస్తాన్‌కు భారత్ బిగ్ షాక్!
“గుజరాత్ రాష్ట్రంలో ఏ వేడుకల్లోనైనా డ్రోన్లు, బాణసంచా వాడకాన్ని ఈ నెల 15 వరకు పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రభుత్వం నిర్ణయాలకు సహకరించాలి. భద్రతా కారణాల చేత తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలి” అని హర్ష్ సంఘవి తన ఎక్స్ (హిందీలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో జరిగిన భద్రతా సమీక్షా సమావేశం అనంతరం తీసుకున్నట్లు తెలిపారు.
ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద చోటుచేసుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. దీనితో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అత్యున్నత స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి రాష్ట్ర భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కచ్, బనస్కంతా, పటాన్, జామ్‌నగర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పౌరుల రక్షణ కోసం చేపడుతున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గుజరాత్ 506 కి.మీ.; పంజాబ్ 532 కి.మీ.; రాజస్థాన్ 1070 కి.మీ.; పశ్చిమబెంగాల్ 2,217 కి.మీ. మేర సరిహద్దు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మిలిటరీ, పోలీస్ దళాలతో సమన్వయం చేసుకుంటూ, ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి.