Ukraine War : ఉక్రెయిన్ ‘మెడిసిన్’ గోడు

ఉక్రెయిన్లోని భార‌తీయ విద్యార్థుల భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. అక్క‌డికి వెళ్లిన విద్యార్థులు ఎక్కువ‌గా ఎంబీబీఎస్ కోర్సు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 1, 2022 / 04:15 PM IST

ఉక్రెయిన్లోని భార‌తీయ విద్యార్థుల భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. అక్క‌డికి వెళ్లిన విద్యార్థులు ఎక్కువ‌గా ఎంబీబీఎస్ కోర్సు చేస్తున్నారు. ఆ కోర్సును మ‌ధ్య‌లోనే వ‌దిలేసి తిరుగుముఖం ప‌ట్టాల్సిన అగ‌త్యం ఏర్ప‌డింది. భార‌తీయ విద్యార్థులు వేలాది మంది ఉక్రెయిన్లోని మెట్రో అండ‌ర్ గ్రౌండ్స్ లో ఉంటున్నారు. ప్ర‌తి ఏడాది కొన్ని వేల మంది ఎంబీబీఎస్ చదువుకోసం అక్క‌డికి వెళుతుంటారు. మొత్తం ఆరేళ్ల పూర్తి కోర్సు పూర్తియిన త‌రువాత భార‌త్ వ‌స్తారు. ఆ త‌రువాత ఎంసీఐ ప‌రీక్ష అర్హ‌త సాధిస్తే భార‌త్ లో డాక్ట‌ర్ గా చ‌లామ‌ణి కావ‌డానికి అవ‌కాశం ఉంది.ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం జ‌రుగుతోన్న త‌రుణంలో మొద‌టి ఏడాది నుంచి ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల వ‌ర‌కు కొన్ని వేల మంది భార‌తీయులు అక్క‌డ ఉన్నారు. కేవ‌లం జ‌ప్రోజియో స్టేట్ యూనివ‌ర్సిటీలోనే 30వేల మంది వ‌ర‌కు భార‌తీయ విద్యార్థులు ఉంటార‌ని అంచ‌నా. పైగా మొద‌టి ఏడాది అడ్మిష‌న్ తీసుకున్న వేలాది మంది విద్యార్థుల పాస్ పోర్ట్ లు ప్రైవేటు క‌న్స‌ల్జెన్సీల వ‌ద్ద ఉండిపోయాయి. దీంతో ఉక్రెయిన్ నుంచి బ‌య‌ట ప‌డలేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 15 వంద‌ల మంది వివ‌రాలు మాత్ర‌మే భార‌త ప్ర‌భుత్వం తెలుసుకోగ‌లిగింది. మిగిలిన వాళ్ల ఆచూకి ల‌భించ‌డంలేదు.

ర‌ష్యన్ ద‌ళాలు చేసిన దాడిలో క‌ర్నాట‌క‌కు చెందిన న‌వీన్ ఉక్రెయిన్లో మృతి చెందాడు. విద్యార్థుల‌ను ఉక్రెయిన్ సైన్యం న‌ర‌కం చూపేలా చేస్తోంద‌ని స‌మాచారం అందుతోంది. ఐక్య‌రాజ్య స‌మితిలో ఉక్రెయిన్ కు భార‌త్ మ‌ద్ధ‌తు ఇవ్వ‌లేదు. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య సంధి చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఉక్రెయిన్ కు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డానికి భార‌త్ వెనుకాడుతోంది. దీంతో భార‌తీయ విద్యార్థుల మీద ఉక్రెయిన్ ద‌ళాలు ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రు ఏమి చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితుల్లో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే, ఉక్రెయిన్ నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డ విద్యార్థుల చ‌దువు భార‌త్ లో ఎందుకూ ప‌నికిరాదు. అర్థాంత‌రంగా యూనివ‌ర్సిటీలు బంద్ చేయ‌డంతో పాటు యుద్ధం ఎంత కాలం ఉంటుందో కూడా తెలియ‌దు. ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో ఎంబీబీఎస్ పూర్తి చేయ‌డానికి ఉక్రెయిన్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉంది. మూడేళ్లు, నాలుగేళ్లు , ఐదేళ్లు చ‌దివిన వాళ్లు అర్థాంత‌రంగా చ‌దువు ముగించాల్సి వ‌స్తుంది. భార‌త ప్ర‌భుత్వం విదేశీ మెడిసిన్ మీద ఇప్ప‌టికే స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపుతోంది. విదేశాల్లో హౌస్ స‌ర్జ‌న్ చేసిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఇండియాలో కూడా చేయాల‌ని కొత్త‌గా నిబంధ‌న పెట్టారు. పైగా భారీ ఫీజులు చెల్లించి ఇండియాలో హౌస్ స‌ర్జ‌న్ కోసం ఏడాది పాటు ఉచిత సేవ‌లు చేయాల‌ని ఇటీవ‌ల నిబంధ‌న‌ల పెట్టింది. ఇప్పుడు చ‌దువును మ‌ధ్య‌లోనే ముగించిన ఉక్రెయిన్ నుంచి బ‌య‌ట ప‌డ్డ వాళ్ల‌ను భార‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

ఇండియాలోని మెడిక‌ల్ కాలేజిల్లో అడ్మిషన్ ఇవ్వ‌డానికి అవ‌కాశంలేదు. కోవిడ్ కార‌ణంగా రెండేళ్లుగా విదేశీ ఎంబీబీఎస్ చ‌దువుకు వెళ్లిన వాళ్లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ఉక్రెయిన్, ర‌ష్యా యుద్ధం రావ‌డంతో విద్యార్థుల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారు అయింది. దీనికి భార‌త ప్ర‌భుత్వం ముందు ఉన్న ప్ర‌త్యామ్నాయాల్లో ఒక‌టి ఎంసీఐ ప‌రీక్ష లేకుండా భార‌త్ లైసెన్స్ ఇవ్వ‌డం. ఫైన‌ల్ ఇయ‌ర్ చదువుతోన్న విద్యార్థుల‌కు ఎంసీఐ ప‌రీక్ష నుంచి మిన‌హాయించ‌డం, ప్ర‌త్యేకంగా విదేశీ విద్య‌కు వెళ్లిన వాళ్ల‌కు చ‌దువును భార‌త్ లో కొన‌సాగించ‌డం, ఎంసీఐ పాస్ మార్కుల‌ను త‌గ్గించ‌డం త‌దిత‌రాల‌ను ప‌రిశీలించ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, భార‌త ప్ర‌భుత్వం విదేశీ మెడిసిన్ పై చిన్న‌చూపుతున్న క్ర‌మంలో రిలాక్సేష‌న్ ఎంత వ‌ర‌కు ఇస్తుందో చూడాలి.